calender_icon.png 19 March, 2025 | 11:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పది పరీక్షల్లో విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఉత్తమ ఫలితాలు సాధించాలి..

19-03-2025 06:58:10 PM

ట్రస్మా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్. ఎన్. రెడ్డి..

ముషీరాబాద్ (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 21 నుండి జరిగే పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలను సాధించాలని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్.ఎన్.రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ప్రతి విద్యార్థి తన పాఠశాలలో ఏ విధంగా పరీక్షలు రాస్తారో అదే విధంగా పదవ తరగతి పరీక్ష సెంటర్లో పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలను సాధించాలని ఆయన కోరారు. ప్రతిరోజు రాత్రిపూట పది గంటల వరకు చదవాలని, తెల్లవారుజామున 4-30 నిమిషాలకు నిద్రలేవాలని, మనసులో ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉండాలన్నారు.

ఎట్టి పరిస్థితుల్లో రాత్రిపూట నిద్ర భంగం కానివ్వకూడదన్నారు. విద్యార్థులు చదువుతున్నప్పుడు మధ్యలో అరగంట విశ్రాంతి తీసుకొని పుస్తకాలను తిరిగేయాలన్నారు. పౌష్టికాహారాన్ని లేటుగా తీసుకోకుండా సరైన సమయంలో తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయులు చెప్పే సూచనలు తూచా తప్పకుండా గమనించాలన్నారు. పరీక్షా కేంద్రంలో జవాబు పత్రాలు ఇవ్వగానే దానికి మార్జిన్లు కొట్టాలన్నారు. విద్యార్థులు బాగా వచ్చిన ప్రశ్నలు ముందుగా వ్రాసి తప్పులు కొట్టివేతలు లేకుండా చూసుకోవాలన్నారు. జవాబులు గుర్తు రాకపోతే చిరునవ్వుతో మూడుసార్లు ఊపిరి పూర్తిగా పీల్చుకొని వదలాలని, అప్పుడే ఒత్తిడి మొత్తం వెళ్లిపోతుందన్నారు. మర్చిపోయిన విషయాలు గుర్తుకొస్తాయన్నారు. చివరి 15 నిమిషాలు వ్రాసిన పేపర్ ని ఒకసారి పరిశీలించుకోవాలన్నారు.

ముందుగా బీట్ పేపర్ ఇవ్వగానే దారంతో కట్టాలన్నారు. వార్నింగ్ బెల్లు మ్రోగినా అన్ని పరిశీలించాకే తృప్తిగా బయటకు రావాలన్నారు. బొమ్మలు, మ్యాప్, గ్రాఫ్ పేపర్ మీద పెన్నులు ఉపయోగించకూడదన్నారు. విద్యార్థులు 10 పరీక్షల్లో ఆలోచించి రాసి మంచి ఫలితాలను సాధించి ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల గౌరవాన్ని నిలబెట్టాలన్నారు. పది పరీక్షలు రాయబోయే విద్యార్థులకు ఈ సందర్భంగా వారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా ప్రధాన కార్యదర్శి కే. అనిల్ కుమార్, కోశాధికారి కే. శ్రీకాంత్ రెడ్డి, ఫౌండర్ ప్రెసిడెంట్ కె. పాపిరెడ్డి ముఖ్య సలహాదారు కే. అనంతరెడ్డి, స్పోక్స్ పర్సన్ లయన్ సి. రామచందర్ తదితరులు పాల్గొన్నారు.