16-03-2025 06:06:49 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలో ఎస్సీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో సౌకర్యాలు కల్పించడం లేదని విద్యార్థులు ఆదివారం రోడ్డెక్కారు. కనీస సౌకర్యాలు కల్పించకుండా, మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని ఆరోపించారు. అరటి పండ్లు, కోడిగుడ్లు నెలల తరబడి పెట్టడం లేదని, కనీసం వంట చేయడానికి హాస్టల్ లో గ్యాస్ కూడా లేనటువంటి పరిస్థితి ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదుల సంఖ్యలో విద్యార్థులు ఉన్న హాస్టల్లో ఒక్క కిలో నూనె కూడా లేనటువంటి పరిస్థితి ఉందని, విద్యార్థుల పట్ల వార్డెన్ శ్రీనివాస్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు.
విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా విద్యార్థుల కడుపులు కొట్టి అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ వార్డెన్ శ్రీనివాస్ మరోసారి సస్పెండ్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఉన్నత చదువుల కొరకు అమ్మ, నాన్నను కుటుంబాన్ని వదులుకొని హాస్టల్ లో ఉంటున్న విద్యార్థుల పట్ల శ్రీనివాస్ వార్డెన్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడని, విద్యార్థుల కడుపు కొట్టి తమ ఇంటికి డబ్బులు వాడుకుంటున్నాడని ఆరోపించారు. మెనూ ప్రకారం పెట్టినట్టు రికార్డుల్లో తప్పుడు లెక్కలు చూపెడుతున్నాడని.. గతంలో మందమర్రిలో హాస్టల్ వార్డెన్ గా పనిచేసినప్పుడు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా ఉండడం వల్ల విద్యార్థులు, విద్యార్థులె కొట్టుకోవడంతో ఒక విద్యార్థి తీవ్ర గాయాలపాలై చనిపోవడం జరిగిందన్నారు.
విద్యార్థి చావుకు కారణం వార్డెన్ శ్రీనివాస్ కావడంతో అతనిని సస్పెండ్ చేశారని, సస్పెండ్ అయి ఉన్నప్పటికీ ఎంక్వయిరీ జరుగుతున్న సందర్భంలోని ఆయనకి మళ్లీ బెల్లంపల్లి ఎస్సీ హాస్టల్లో వార్డెన్ గా పోస్ట్ ఇవ్వడం వల్ల విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టలేని పరిస్థితి తలెత్తుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపై వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల సమయంలో కూడా శ్రీనివాస్ వార్డెన్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.