14-04-2025 12:00:00 AM
తాగునీటి కోసం విద్యార్థినుల గోస
కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని దుస్థితి
మోర్గి బాలికల వసతి గృహంపై పాలకుల చిన్నచూపు
నాగల్ గిద్ద, ఏప్రిల్ 13 : వసతి గృహాలలో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని ఇటు పాలకులు, అటు అధికారులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలో సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదు. వేసవి కాలం ప్రారంభమైనప్పటి నుండి తాగునీరు రాకపోవడంతో నాగల్‌గిద్ద మండలం మోర్గి బాలికల వసతి గృహంలో విద్యార్థినీల గొంతెండి పోతుంది. ఎన్నిసార్లు అధికారులకు, పాలకులకు మొర పెట్టుకున్నా నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారు తప్ప శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదు.
ప్రస్తుతం ఈ వసతి గృహంలో తీవ్రమైన మంచినీటి సమస్య నెలకొంది. గ్రామంలోని మిషన్ భగీరథ పథకం నీరు సరఫరా అయ్యేది. వేసవి దృష్ట్యా మిషన్ భగీరథ పథకం నుండి నీరు రావడం లేదు. దీంతో గత 15 రోజులుగా విద్యార్థినీలు తాగడానికి గుక్కెడు నీటికోసం అవస్థలు పడుతున్నారు. రెండు, మూడు రోజులకోమారు స్నానాలు చేస్తున్నామని విద్యార్థినీలు వాపోయారు. అంతేగాకుండా కాలకృత్యాలు తీర్చుకోవడానికి సైతం చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతానికి వసతి గృహంలో పది మంది వరకు బాలికలు ఉన్నారని వసతి గృహం ఇంచార్జి రాజేశ్వరి తెలిపారు.
ఈమె కూడా రెగ్యులర్ ఇంచార్జి కాకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. తమను పట్టించుకునే వారు లేకుండా పోయారని విద్యార్థినీలు వాపోతున్నారు. పదవ, ఇంటర్ విద్యార్థులు పరీక్షలు పూర్తయినందున వెళ్ళిపోయారని, కేవలం 8, 9వ తరగతి విద్యార్థినీలు మాత్రమే ఉన్నారు. ఈ వసతి గృహంలో వంద మందికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న విద్యార్థినీలకు వారంకోమారు కూరగాయలు తెస్తున్నారని, అలాగే ప్రతిరోజు పాలు ఇవ్వాల్సి ఉండా బంద్ చేశారు.
ప్రభుత్వ సెలవులు వచ్చే వరకైనా తమకు కడుపునిండా భోజనం, తాగడానికి, కాలకృత్యాలు తీర్చుకోవడానికి నీటి సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే రానున్న విద్యా సంవత్సరం వరకు వసతి గృహంలో శాశ్వత మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడమే కాకుండా రెగ్యులర్ వార్డెన్‌ను ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయమై ఇంచార్జి అధికారి రాజేశ్వరిని వివరణ కోరగా తాగునీటి సమస్య ఉన్నమాట వాస్తవమేనని, గ్రామ పంచాయతీ నుండి ట్యాంకర్ ద్వారా సరఫరా చేసినా ఇబ్బందిగా ఉందన్నారు. కొద్దిమంది మాత్రమే ఉన్నందున పాలు ఇవ్వడం లేదని చెప్పారు.