ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి
దౌల్తాబాద్,(విజయక్రాంతి): విద్యార్థులు కష్టపడి టెన్త్ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాయపోల్ మండలం బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంజిరెడ్డి అధ్యక్షతన సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డి పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుకు పేదరికం అడ్డు కాదని, ప్రతి విద్యార్థి పట్టుదల, ఆలోచన, క్రమశిక్షణతో ముందుకు సాగితే విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చన్నారు. ఉన్నతమైన చదువు చదువుకుంటేనే సమాజంలో గుర్తింపు వస్తుందన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నతమైన స్థానాలు అధిరోహించాలన్నారు. 20 ఏళ్లు కష్టపడి చదివితే మరో 80 ఏళ్లు బాగుపడతారని, రానున్న పది పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించి సిద్దిపేట జిల్లాను రాష్ట్రంలోని అగ్రస్థానంలో ఉండేందుకు ప్రతి విద్యార్థి చదువుపై దృష్టి సారించాలన్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి బేగంపేట ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థులకు చక్కటి బోధన అందించారన్నారు. ఉపాధ్యాయుడిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిఆర్పిలు పాల్గొన్నారు.