calender_icon.png 20 October, 2024 | 6:52 AM

విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచాలి

20-10-2024 02:18:08 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 19 (విజయక్రాంతి): పెరిగిన ధరలకు అనుగుణంగా కాలేజీ, పాఠశాల, గురుకుల హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలను పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. అలాగే స్కాలర్‌షిప్‌లను పెంచడంతో పాటు రూ.4కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం బీసీ సంఘం పిలుపునిచ్చిన సంక్షేమ భవన్ ముట్టడి కార్యక్రమంలో కృష్ణయ్య పాల్గొన్నారు. పోలీసులు అడ్డుకోవడంతో సంక్షేమ భవన్ ఎదుట బైఠాయించిన కృష్ణయ్య ట్లాడుతూ.. తెలంగాణలో కాలేజీ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు రూ.5,500 మాత్రమే స్కాలర్‌షిప్ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పక్కరాష్ట్రాలైన ఏపీ, కర్ణాటకలో.. ప్రతి విద్యార్థికి రూ.20వేలు, రూ.15వేలు ప్రతి సంవత్సరం స్కాలర్‌షిప్ ఇస్తున్నారని తెలిపారు. తెలంగాణలోనూ స్కాలర్‌షిప్‌లను రూ.20వేల వరకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.  అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలేజీ హాస్టల్ విద్యార్థుల మెస్‌చార్జీలను రూ.1500 నుంచి రూ.3వేలకు పెంచాలని, 8 నుంచి 9వ తరగతి పాఠశాల, గురుకుల విద్యార్థులకు రూ.2,500, 3 నుంచి 7వ తరగతి విద్యార్థులకు రూ.2,000 వరకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.  ఈ ఆందోళన కార్యక్రమంలో బీసీ సంఘం నేతలు.. వేముల రామకృష్ణ, నీల వెంకటేష్, నంద గోపాల్, అనంతయ్య, రాజేందర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 

* బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య

* విద్యార్థులతో కలిసి సంక్షేమ భవన్ ముట్టడికి యత్నం