calender_icon.png 15 January, 2025 | 10:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం

14-07-2024 12:39:36 AM

కేయూలో ఎస్‌ఎఫ్‌ఐ, బీఆర్‌ఎస్‌వీ ఆందోళన 

హనుమకొండ, జూలై 13 (విజయక్రాంతి): కాకతీయ యూనివర్సిటీ అధికారులు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విద్యార్థి సంఘాలు మండి పడ్డాయి. శుక్రవారం రాత్రి పోతన హాస్టల్ బిల్డింగ్ సీలింగ్ పెచ్చులూడి కిందపడిన ఘటనను నిరసిస్తూ శనివారం యూనివర్సిటీలో ఎస్‌ఎఫ్‌ఐ, బీఆర్‌ఎస్‌వీ విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టాయి. పోతన హాస్టల్ భవనం ఎదుట బైటాయించి అధికారుల తీరుపై మండి పడ్డారు. ఈ సందర్భంగా ఆ సంఘాల నాయకులు మంద శ్రీకాంత్, బైరబాక ప్రశాంత్ మాట్లాడుతూ.. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పోతన హాస్టల్‌లో 94 వ గదిలో సీలింగ్ పెచ్చులూడినట్లు ఆరోపించారు.

౧౫ రోజుల క్రితం ఇదే హాస్టల్లో ఫ్యాన్ ఊడి పడటంతో ఓ విద్యార్థికి తలకు గాయమైన విషయాన్ని గుర్తుచేశారు. గతంలో ఎన్నోసార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చామని, కానీ ఎలాంటి మార్పు రాలేదన్నారు. వరుసగా ప్రమాదాలు జరుగుతున్న అధికారులు స్పందించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పోతన హాస్టల్ లో ఉంటున్న విద్యార్థులు వేరే భవనంలోకి మార్చాలని వారు డిమాండ్ చేశారు. శిథిలావస్థలో ఉన్న హాస్టల్స్ స్థానం లో నూతన బిల్డింగ్స్ నిర్మించాలని కోరారు. లేకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలో జశ్వంత్, పవన్ తదితరులు పాల్గొన్నారు.