calender_icon.png 24 December, 2024 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకులంలో విద్యార్థులకు పురుగులన్నం

16-09-2024 01:20:43 AM

కరీంనగర్, సెప్టెంబర్ 15: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకులంలో ఆదివారం యాజమాన్యం విద్యార్థినులకు పురు గులన్నం పెట్టడం కలకలం రేపింది. సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు వెంటనే గురుకులానికి వచ్చి యాజమాన్యాన్ని నిలదీశారు. పురుగుల భోజనాన్ని మీడియా చూపిస్తూ తమ ఆవేదనను వ్యక్తంచేశారు. పిల్లలను కంటికి రెప్పలా చూసుకుం టారని హాస్టల్ లో చేర్పిస్తే పురుగులన్నం పెడుతున్నారని కన్నీరు పెట్టుకున్నారు. పిల్లలకు అందించే భోజనం మరీ అధ్వానంగా ఉందని, మనుషులెవరైనా ఇలాంటి అన్నం తింటారా.. ? అని నిలదీశారు.

ఇంత జరుగుతున్నా ప్రిన్సిపాల్‌తో సహా ఏ ఒక్క టీచరు కూడా హాస్టల్ లేరని వాపోయారు. హాస్టల్ పరిసరాలు కంపు కొడుతున్నాయని, ఎక్కడ వేసిన చెత్త అక్కడే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలు రోగాల పాలైతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. వెంటనే సమస్యలన్నింటినీ పరిష్కరించకుంటే గురుకులం ముందు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. తల్లిదండ్రులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. విద్యార్థుల బాగోగులు మరిచిన ప్రిన్సిపాల్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

తల్లిదండ్రులు ఆందోళన  చేస్తున్న విషయం తెలుసుకున్న బిల్డింగ్ యజయాని గురుకులానికి వచ్చారు. తాను మురుగు నీటి కాలువకు మరమ్మతులు చేయిస్తానంటే ప్రిన్సిపాల్ తనను హాస్టల్లోనికి అనుమతించడం లేదని యజమాని వాపోయాడు. ప్రిన్సిపాల్ అనుమతిస్తే నాలుగు రోజుల్లో మురుగు కాలువ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చాడు.

తల్లిదండ్రులకు సీపీఐ మండల ప్రధాన కార్యదర్శి చోక్కళ్ల శ్రీశైలం, ఇతర నాయకులు మద్దతు ఇచ్చారు. ఇటీవల ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, గురుకులంలో వసతులు బాగుండాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. అయినప్పటికీ యాజామాన్యం తీరులో ఎలాంటి మార్పు రాకపోవడం గమనార్హం.