17-12-2024 12:07:05 AM
నిర్మల్ జిల్లాలో 5,800 మందిపై ప్రభావం
నిర్మల్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె బాట పట్టడంతో కేజీబీవీ విద్యార్థులపై తీవ్ర ప్రభా వం పడింది. కేజీబీవీల్లో పనిచేస్తున్న ఎస్వో ల నుంచి మొదలుకుని అటెండర్, వంట మనుషుల వరకు సమగ్ర శిక్ష పరిధిలోకి వస్తారు. వారంతా ఈ నెల 6 నుంచి ఆందోళన చేస్తుండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
నిర్మల్ జిల్లా లో మొత్తం 19 కేజీబీవీలు ఉండగా 5,800 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు 8 పాఠశాలలు ఉండగా 11 పాఠశాలల్లో పదవ తరగతి వరకు విద్యాబోధన చేస్తున్నారు. ఇందులో సబ్జెక్టు ఉపాధ్యాయుల తో పాటు అధ్యాపకులు, పీఈటీలు, క్లర్కు లు, డేటా సిబ్బంది, వంటవారు, వాచ్‌మె న్, అటెండర్‌లు ఉన్నారు.
వారు సమ్మెలో పాల్గొనడంతో విద్యార్థుల చదువుకు బ్రేక్ పడింది. ఒక్కో పాఠశాలలో 240 వరకు పిల్లలు చదువుతుండగా, కాలేజీలు, ఉన్నత పాఠశాలల్లో 160 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతి రోజు విద్యార్థుల రక్షణ దృ ష్ట్యా ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులను పాఠశాలలో ఉంచినప్పటికీ వారు బోధనకు దూరంగా ఉంటున్నారు. పిల్లల రక్షణ, అవసరాలు, ఆరోగ్యంపైనే దృష్టి పెట్టాల్సి వస్తుంది. దీంతో విద్యార్థులు తరగతి గదికే పరిమితమై చదువుకుంటున్నారు.
పరీక్షల్లో నష్టపోయే ప్రమాదం..
ప్రభుత్వం ఇప్పటికే పదవతరగతి, ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌లో నిర్వహించడానికి చర్యలు తీసుకుంటుంది. ఈ సమయంలో ఉపాధ్యాయులు సమ్మె చేయడంతో పరీక్షల్లో విద్యార్థులు నష్టపోయే అవకాశముంది.