calender_icon.png 25 December, 2024 | 12:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైజ్ఞానిక పాఠాలకు విద్యార్థులు దూరం

27-07-2024 02:11:49 AM

  1. నిలిచిపోయిన ఆర్‌ఎంఎస్‌ఏ పథకం 
  2. ప్రభుత్వ బడులకు ఐదేళ్లగా నిధులు లేవు
  3. పాత పరికరాలతోనే నెట్టుకొస్తున్న ఉపాధ్యాయులు

వికారాబాద్, జూలై 26 (విజయక్రాంతి): సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నా ప్రభుత్వ బడు ల్లో విద్యార్థులు వైజ్ఞానిక పాఠాలకు దూరమవుతున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో 6వ తరగతి నుంచే టెక్నో, సీ బ్యా చ్ రకరకాల కోర్సులతో విద్యాబోధన చేస్తున్నా ప్రభుత్వ పాఠశా లల్లో మాత్రం సాంకేతిక విద్యాబోధన సరిగ్గా జరగడంలేదు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సైన్స్ విద్యును అందించే ప్రయోగాత్మక బోధన అటకెక్కింది. ఐదేళ్లుగా నిధులు విడుదల కాకపోవ డంతో పాత పరికరాలతోనే టీచర్లు నెట్టుకొస్తున్నారు. ఫలితంగా విజ్ఞాన విద్య అందక సైన్స్ ప్రయోగాలపై విద్యార్థులకు అవగాహన లేకుండా పోతున్నది. జిల్లాలో 174 జెడ్పీహెచ్‌ఎస్‌లు, 116 యూపీఎస్‌లు, 764 ప్రాథమిక పాఠశాలలుండగా92,500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 

పాఠశాల స్థాయి సైన్స్ ప్రయోగాలే కీలకం..

పాఠశాల స్థాయి నుంచే సైన్స్ ప్రయోగాలపై అవగాహన ఉంటే ఉన్నత చదువుల్లో విద్యార్థులు రాణించి, ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంది. 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు సైన్స్ సబ్జెక్టుల్లో ఎక్కువ భాగం ప్రయోగాలతో కూడిన పాఠ్యాంశాలు ఉన్నాయి. ల్యాబ్‌లో ప్రయోగం ద్వారా చెబితేనే ఆ పాఠాలు పూర్తిగా అర్థమవుతాయి. ఉపాధ్యాయులు ప్రత్యేకంగా దృష్టి సారించినప్పటికీ పరికరాలు లేకపోవడంతో ఇబ్బం దులు పడుతున్నారు. ప్రయోగ పరికరాలు, రసాయనాల కొనుగోలుకు గతంలో విద్యాశాఖ అరకొర నిధులు మంజూరు చేసింది. వాటితో పూర్తిస్థాయిలో పరికరాల కొనుగోలు సాధ్యపడలేదు. అరకొరగా ఉన్న పరికరాలతో ప్రయోగాలు సంపూర్ణంగా చేసే అవకాశం లేకుండాపోయింది. 

ఐదేళ్లుగా విడుదలకాని నిధులు..

2019లో రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్(ఆర్‌ఎంఎస్‌ఏ) ద్వారా ప్రతి ఉన్నత పాఠశాలకు రూ.50 వేలు, ప్రాథమికోన్నత పాఠశాలకు సర్వశిక్ష అభియాన్ ద్వారా రూ.22వేలను విడుదల చేశారు. వీటిద్వారా కొన్ని ప్రయోగ పరికరాలు కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఆర్‌ఎంఎస్‌ఏ పథకం అమలు నిలిచిపోవడంతో నిధులు మం జూరు కావడం లేదు. దీంతో పాఠశాలల్లో ప్రయోగాత్మక బోధన నిర్వహణ కష్టతరంగా మారింది. 

పోటీలకు దూరంగా విద్యార్థులు..

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రయోగాలపై పూర్తి స్థాయి అవగాహన లేకపోవడంతో సైన్స్‌కు సంబంధించిన పోటీల కు దూరంగా ఉంటున్నారు. ఏటా ప్రభుత్వం నిర్వహించే సైన్స్‌ఫెయిర్, ఇన్స్‌స్పైర్ అవార్డుల కార్యక్రమాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వెనుకబడిపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రయో గాత్మక బోధనకు అవసరమైన పరికకాలు సమకూర్చడంతో పాటు బోధన జరిగేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. 

ప్రయోగాత్మక విద్యను చెప్పిస్తున్నాం

2019లో సైన్స్ పరికరాలు, రసాయనాలు అన్నీ పాఠశాలలకు వచ్చాయి. కొవిడ్ సమయంలో సరిగ్గా వాటిని ఉపయోగించలేదు. ఆ తర్వాత మూడు ఏళ్లుగా ఉపాధ్యాయులు ప్రయోగాత్మక విద్యను బోధిస్తున్నారు. కొన్నిచోట్ల పరికరాలు పనిచేయడం లేదు. మరికొన్ని చోట్ల రసాయనాలు అయిపోయాయి. ఉన్నదాంట్లోనే సరిపెడుతూ ప్రయోగం చేపిస్తున్నారు. సైన్స్ పరికరాలు, రసాయనాలు కావాలని మరోసారి ప్రతిపాదనలు పంపుతాం.

- రేణుకాదేవి, జిల్లా విద్యాధికారి, వికారాబాద్