ఉపాధ్యాయులను ఎందుకు తొలగించారు
మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): కాంగ్రెస్‌ప్రభుత్వ నిర్వాకంతోనే ఉపాధ్యాయ దినోత్సవం రోజున గురుకుల విద్యార్థులు ధర్నా చేశారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. గురువులను సన్మానించుకుని సంబురాల్లో మునిగి తేలాల్సిన విద్యార్థులను చదువులు మానేసి ధర్నాలకు దిగేలా రేవంత్ ప్రభుత్వం చేయడం దురదృష్టకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ తమ గురువులకు మద్దతుగా గురుకుల విద్యార్థులు పిడికిలి బిగించడం అభినందనీయమన్నారు.
ఐఐటీ, ఎన్‌ఐటీ, నీట్ వంటి జాతీయస్థాయి పరీక్షల్లో విద్యార్థులు ర్యాంకు లు సాధించేలా వెన్నంటి నిలచిన గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఉపాధ్యాయులను నిర్ధాక్షిణ్యంగా తొలగించడం దుర్మార్గమైన చర్య అన్నారు. విద్యా సంవత్సరంలో మధ్యలో 6,200 మంది గురుకుల ఉపాధ్యాయులను తొలగించిన నిర్ణయంతో వేలమంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ బేషజాలకు పోకుం డా ఉద్యోగాల నుంచి తీసేసిన గురుకుల టీచర్లను తక్షణమే విధుల్లోకి తీసుకోని విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని సూచించారు. తమ పిల్లల భవిష్యత్తు గురించి కలలుగన్న తల్లిదండ్రులకు ఏం సమాధానం చెబుతారని సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన ప్రశ్నించారు.