11-03-2025 01:01:07 AM
హైదరాబాద్, మార్చి 10 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. గురుకులాలను కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేయడంపై ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా ‘ఆ పాపం ముఖ్యమంత్రికి తగలక మానదు’ అని ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
గురుకులాల్లో మోగుతున్న విద్యార్థుల మరణమృదంగాన్ని ఆపడం చేతకాని ముఖ్యమంత్రి రేవంత్‌కు కనీస మానవత్వం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసమర్థ కాంగ్రెస్ సర్కారు వల్లే లాలిత్య మృతిచెందడం బాధాకారమన్నారు.
కళ్ల ముందు విగతజీవిగా పడి ఉన్న బిడ్డ మృతదేహం చూసి గుండెలు పగిలిన తల్లిదండ్రులను ఓదార్చాల్సింది పోయి, పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకోవడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. కాంగ్రెస్ సర్కార్ పాలన రోజురోజుకూ దిగజారిపోవడంతో పాటు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును రాష్ర్ట ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. సీఎం రేవంత్ విద్యాశాఖ, హోంమంత్రిగా అట్టర్ ప్లాఫ్ అయ్యారని విమర్శించారు.