calender_icon.png 29 October, 2024 | 12:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఘర్షణ

13-09-2024 12:04:36 AM

  1. సీఐ కండ్లముందే పరస్పర దాడులు
  2. ఏవోకు ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి 

నిర్మల్ ,సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి, పరస్పరం దాడులకు దిగినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. విద్యార్థులు ఘర్షణ పడ్డ విషయం గురువారం రాత్రి వరకు గోప్యంగా ఉంచినా.. అది బయటకు పొక్కడంతో బాసర ట్రిపుల్ ఐటీ అధికారులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాసర ట్రిపుల్ ఐటీలో వినాయకుడిని ప్రతిష్టించగా 5 రోజులను పురస్కరించుకొని బుధవారం రాత్రి నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. సీనియర్, జూనియర్ విద్యార్థులు వినాయన నిమజ్జన కార్యక్రమంలో నృత్యాలు చేస్తున్న సందర్బంలో రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగి తోపులాట జరిగింది.

చిలికిచిలికి గొడవ పెద్దదై విద్యార్థులు రెండు వర్గాలుగా చీలిపోయి పరస్పరం దాడులు చేసుకొన్నారు. భయాందోళనకు గురైన విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. నిమజ్జన శోభయాత్రకు బందోబస్తుకు వచ్చిన సీఐ అక్కడే ఉన్నా గొడవను నియంత్రించకపోవడంపట్ల ఓ వర్గం విద్యార్థులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. రెండు వర్గాలను చెదర గొట్టాల్సిన సీఐ.. కావాలని సీనియర్ విద్యార్థులపై దాడి చేయించి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో గొడవ జరిగిన్పప్పటికీ, బయటకు రాకుండా అధికారులు, పోలీసులు జాగ్రత్త పడటంపైనా విమర్శలు వస్తున్నాయి. గురువారం రెండు వర్గాల విద్యార్థులు వర్సిటీ పరిపాలన అధికారులకు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నట్టు తెలిసింది. తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని బాసర పోలీసులు తెలిపారు.