15-03-2025 06:49:27 PM
జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్..
గద్వాల (విజయక్రాంతి): విద్యార్థులు తమ ప్రతిభను పట్టుదల, నిరంతర శ్రమ, దృఢ సంకల్పం పెంపొందించుకుంటే, జీవితంలో ఏ లక్ష్యమైనా సాధించగలరని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అన్నారు. శనివారం ఎర్రవల్లిలోని సరస్వతి ఇంటర్నేషనల్ పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... సరస్వతి ఇంటర్నేషనల్ పాఠశాల గ్రామీణ ప్రాంతంలోని సిబిఎస్ఈ పాఠశాలగా అభివృద్ధి చెందినట్లు తెలిపారు.
2009 నుంచి ప్రతి సంవత్సరం 100% ఫలితాలను సాధిస్తున్న ఈ పాఠశాల, ఈ ఏడాది కూడా అదే విజయాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. కలెక్టర్ తమ విద్యాభ్యాసం, UPSC సాధన అనుభవాలను విద్యార్థులతో పంచుకుంటూ, “కలలు కనే ప్రతి ఒక్కరూ వాటిని నిజం చేసుకునే ధైర్యం, పట్టుదల కలిగి ఉండాలన్నారు.
మీరు ఎక్కడి నుండి వచ్చారో కాదు, మీ లక్ష్యం ఎంత గొప్పదో, దాని కోసం ఎంత కృషి చేస్తున్నారో అదే నిజమైన విజయాన్ని నిర్దేశిస్తుందని అన్నారు. విద్యార్థులు చదువులో మాత్రమే కాకుండా, క్రీడలు, శారీరక విద్య, మౌలిక నైపుణ్యాల్లో కూడా అభివృద్ధి సాధించాలని సూచించారు. ఇప్పటి తరం విద్యార్థులు ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని, 10వ తరగతి, 12వ తరగతిలో విఫలమయ్యారని నిరాశకు లోనవ్వడం, మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, ఓటమిని స్వీకరించి, దాన్ని సవాల్‌గా తీసుకొని కృషి చేస్తే విజయాన్ని సాధించవచ్చని అన్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలని, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి తాజా సాంకేతికతలను నేర్చుకోవడం ద్వారా విద్యలో మరింత ఉత్తమంగా రాణించవచ్చని సూచించారు.
తల్లిదండ్రులు పిల్లల ప్రతిభను గుర్తించి,వారి అభివృద్ధికి అండగా నిలవాలని కలెక్టర్ సూచించారు. సరైన ప్రోత్సాహం అందించడంతో విద్యార్థులు సమగ్రంగా ఎదిగి విజయాన్ని సాధించగలరని తెలిపారు. అనంతరం గత ఏడాది సిబిఎస్ఈ 10వ తరగతి టాపర్ తల్లిదండ్రులకు కలెక్టర్ మిమెంటో అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నరేష్, పాఠశాల చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, డైరెక్టర్ శ్రీనివాస్,పాఠశాల సిబ్బంది,విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.