31-03-2025 08:10:08 PM
నియంతలాగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి నిర్భందాన్ని ప్రయోగిస్తూ అక్రమ అరెస్టులు చేస్తే ఊరుకునేది లేదు..
ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బయ్యా అభిమన్యు డిమాండ్..
కొత్తగూడెం (విజయక్రాంతి): భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థుల అరెస్టులను వ్యతిరేకిస్తూ కొత్తగూడెంలో సోమవారం ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బయ్యా అభిమన్యు, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు రామ్ చరణ్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని లేకుండా చేసిందని, నియంతృత్వాన్ని, అహంకారాన్ని ప్రదర్శించిందని ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అంతకంటే ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో నిర్భందాన్ని, అహంకారన్ని ప్రదర్శిస్తున్నారనీ ధ్వజమెత్తారు. దానిలో భాగంగానే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీకి చెందిన 400 ఎకరాల భూములని కర్పొరేట్ సంస్థలకు వేలం వేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత పది రోజులుగా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా వారిపై నిర్బంధాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని ఎవరైనా వచ్చి ముఖ్యమంత్రిని కలసి సమస్యలు చెప్పుకోవచ్చని అసెంబ్లీలో ప్రకటించిన రేవంత్ రెడ్డి సోమవారం విద్యార్థులని చూడకుండా అమ్మాయిలని చూడకుండా గాయాలు చేసి, లాక్కుని పోయి, నిర్బందాన్ని ప్రయోగిస్తూ పోలీసులు పిడిగుద్దులు గుద్దుతూ వ్యాన్లలో ఎత్తేవేస్తూ అరెస్టు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. తక్షణమే ఈ చర్యలను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. యూనివర్సీటీలో దింపిన పోలీస్ బలగాలను వెనక్కి పిలిపించాలి. జేసీబీ, బుల్డోజర్లను అక్కడి నుండి ఖాళీ చేయించాలి. హెచ్‌సీయూకు చెందిన భూముల వేలాన్ని అపాలని డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే అరెస్టు చేసిన విద్యార్థులను బేషరతుగా విడిదల చేయాలని లేని పక్షంలో విద్యార్థుల తరపున ముఖ్యమంత్రి ఇంటిని కూడా ముట్టడిస్తామని ఈ సందర్బంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం స్థానిక ఎస్ఎఫ్ఐ నాయకులు ఉదయ్, తనుజ్, బాలకృష్ణ, వేణు, దిలీప్, వంశీ, రవి, సుమంత్ తదితరులు పాల్గొన్నారు.