calender_icon.png 2 April, 2025 | 10:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్‌సియూ దాడిని ఖండిస్తూ విద్యార్థి సంఘాలు నిరసనలు

01-04-2025 03:08:53 PM

హైదరాబాద్,(విజయక్రాంతి):  హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన దాడిని ఖండిస్తూ మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో నిరసన కార్యక్రమం చేపట్టాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీను మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి వేలం వేస్తున్నది హెచ్‌సియూ భూములను కాదు, హైదరాబాద్ ఊపిరితిత్తులను అని అన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్‌సియూకి 2300 ఎకరాల భూమిని ఇస్తే, నేడు అదే పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ భూములను అమ్మడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. పాలన చేతకాక, పన్నులు రాబట్టక, భూములను అమ్మి జీతాలు ఇవ్వాలని చూస్తున్న రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఎన్నికల ముందు ప్రభుత్వ భూమిలోని ఒక గుంట కూడా అమ్మకుండా చూస్తామని చెప్పి రేవంత్ రెడ్డి, నేడు యూనివర్సిటీ భూములు ఎలా అమ్ముతున్నాడు..? అని ప్రశ్నించారు. ఉద్యోగాలు భర్తీ చేయడం, పథకాలు ప్రజలకు అందించడం చేతగాక, ఇవాళ భూములను కాపాడాలని నిరసన తెలియజేసిన విద్యార్థులను ఎక్కడికక్కడ అరెస్టు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో నిర్బంధకాండ కొనసాగిస్తోందని గెల్లు శ్రీను మండిపడ్డారు. నాడు యూనివర్సిటీలో వేముల రోహిత్ చనిపోతే కాంగ్రెస్ ఆగ్రనేత రాహుల్ గాంధీ యూనివర్సిటీకి రెండుసార్లు వచ్చారు. కానీ ఇవాళ విద్యార్థులపై దాడి జరుగుతుంటే కనీసం ఎందుకు స్పందించడం లేదు..? అని అడిగారు.

ప్రజాస్వామ్య వాదులారా, పర్యావరణ రక్షకులారా.. ఈరోజు యూనివర్సిటీ భూములను కాపాడడానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. హెచ్‌సియూ భూముల వేలం ప్రక్రియను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకొని విద్యార్థుల మీద పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిరసన ధర్నాలు, రాస్తారోకోలు చేపడతామని బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీను హెచ్చరించారు.