పాపన్నపేట: పాపన్నపేట మండలంలో ఓ విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాల పాలైంది. సోమవారం పాపన్నపేట కళాశాలకు బస్సులో బయలుదేరగా ప్రమాదవశాత్తు ఆమె బస్సు నుండి కింద పడగా బస్సు వెనుక టైరు విద్యార్థిని అఖిల కాలుపై నుండి వెళ్ళింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు, కుటుంబ సభ్యులు హుటాహుటిన మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి హైదరాబాదు నిమ్స్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహకు ఈ విషయం తెలిపారు.పేద విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. కాగా పాపన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అఖిల బైపిసి మొదటి సంవత్సరం చదువుతుంది. ఈ ఘటనతో నార్సింగ్ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఆర్టీసీ బస్సులపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.