calender_icon.png 13 November, 2024 | 5:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘యాప్’లో విద్యార్థుల ఆరోగ్యం

10-11-2024 12:39:56 AM

  1. జీహెచ్‌సీసీతో వైద్య సహాయం
  2. త్వరలో అందుబాటులోకి హెల్త్ మానిటరింగ్ యాప్
  3. మొదట ఎస్టీ గురుకులాల్లో ప్రారంభం

హైదరాబాద్, నవంబర్ 9 (విజయ క్రాంతి): రాష్ట్రంలో ఉన్న దాదాపు 1000కి పైగా గురుకుల పాఠశాల్లో తరచూ ఏదో ఒకచోట విద్యార్థులు అస్వస్థతకు గురవుతు న్నారు. ఈనేపథ్యంలో విద్యార్థులకు ఆరోగ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు గురుకులం హెల్త్ కమాండ్ సెంటర్ (జీహెచ్‌సీసీ)ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వస్తుంది.

మొదట గిరిజన సంక్షేమ గురుకులాల్లో ప్రాథమికంగా దీనిని ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల జరిగిన గిరిజన సంక్షేమ శాఖ విస్తృతస్థాయి సమావేశంలో దీనికి సంబంధించిన హెల్త్ మానిటరింగ్ యాప్‌ను మంత్రి సీతక్క ఆవిష్కరించారు. త్వరలోనే ఈ ‘యాప్’ ద్వారా కార్యాకలాపాలు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. 

నిర్వహణ ఇలా..

యాప్‌లో విద్యార్థులకు సంబంధించిన డాష్‌బోర్డు, హెల్త్ రికార్డును  ప్రిన్సిపాల్, స్టాఫ్ నర్సులు నమోదు చేస్తారు. యాప్‌లో ఆయా గురుకులాల్లో రోజు అస్వస్థతకు గురై న విద్యార్థుల వివరాలను, సిక్ రూం ఫొటోలను కూడా స్టాఫ్ నర్సు అప్‌లోడ్ చేసి సం బంధిత గురుకుల ప్రిన్సిపాల్‌కు పంపిస్తారు. వీటిని ప్రిన్సిపాల్ పరిశీలించి  అప్రూవ్ చేసి రోజువారీ విద్యార్థుల హెల్త్ రికార్డులను ఎప్పటికప్పుడు గురుకులాల కేంద్ర కార్యాలయానికి చేరవేస్తూ ఉంటారు. 

డాష్‌బోర్డు..

యాప్‌లోని డాష్‌బోర్డులో ఆ రోజు ఎంత విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు, సిక్ రూములో ఎంత మంది ఉన్నారు, కోలుకున్న వారెందరూ, మొత్తం ఎంత మంది విద్యార్థులు అస్వస్థతతో బాధపడుతున్నారనే వివరాలుంటాయి. దీంతోపాటు  ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేర్చిన వారి సంఖ్య,  ఇళ్లకు వెళ్లిన విద్యార్థుల సంఖ్య, ఇంకా చికిత్స అందుకుంటున్న వారి సంఖ్య పొందుపరుస్తారు. అస్వస్థతకు గురైన విద్యార్థుల పేరు, స్కూల్ ఐడీ, పాఠశాల పేరు, జిల్లా, విద్యార్థి చదువుతున్న తరగతి వంటి వివరాలు కూడా డాష్‌బోర్డులో ఉంటాయి. దీనిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. 

హెల్త్ రికార్డు..

హెల్త్ రికార్డులో కూడా విద్యార్థుల పూర్తి వివరాలతోపాటు అస్వస్థతకు గురైన విద్యార్థి ఎత్తు, బరువు, ఏ ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారనే విషయాన్ని దానిలో చేరుస్తారు. జ్వరం, తలనొప్పి, బాడీ పెయిన్స్, జలుబు, అబ్డొమినల్ పెయిన్, వాంతులు, డయేరియా, కన్ను, ముక్కు, గొంతుకు సంబంధించిన సమస్యల వంటి వివరాలు సేకరిస్తారు.

అనంతరం ఆయా విద్యార్థుల్లో ప్రాథమికంగా గుర్తించిన ఆరోగ్య సమస్యలు, అందించిన వైద్య సేవలు, అవాంఛనీయంగా జరిగిన తప్పిదాలు, పాటించాల్సిన డైట్, విద్యార్థికి కేటాయించిన టీచర్ పేరు, తల్లిదండ్రులకు సమాచారం అందించడం వంటి అంశాలు కూడా హెల్త్ రికార్డులో ఉంటాయి.