- డీఈడీ విద్యార్థిని న్యాయం చేయాలని బంధువుల ఆందోళన
- సబ్ కలెక్టర్ హామీతో ఆందోళన విరమణ
కుమ్రంభీం ఆసిఫాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ జిల్లా బెజ్జుర్ మండలం అందుగుటపేటకు చెందిన వెంకటలక్ష్మి జిల్లా కేంద్రంలోని పోస్ట్ మెట్రిక్ హాస్టల్‌లో ఉంటూ డీఈడీ చదువుతున్నది. శుక్రవారం శ్వాస సమస్యతో అస్వస్థతకు గురై మృతిచెందింది. విద్యార్థి, యువజన సంఘాల నాయకులు వెంకటలక్ష్మి కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన చేపట్టగా.. పోలీసులు రంగప్రవేశం చేసి మృతదేహాన్ని అందుగుటపేటకు తరలించారు.
శనివారం కుటుంబ సభ్యులు, బంధువులు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. పోలీసులు బలంవతంగా మృతదేహాన్ని గ్రామానికి తరలించారని ఆరోపించారు. మృతదేహాన్ని జిల్లా కేంద్రానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులకు మద్దతు తెలిపిన బీఆర్‌ఎస్ నాయకులను అరెస్టు చేశారు.
వెంకటలక్ష్మి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, కుటుం బానికి రూ.10 లక్షల అర్థిక సహాయం, ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని బంధువులు డిమాం డ్ చేశారు. డిమాండ్లను ప్రభుత్వానికి నివేదిస్తామని సబ్ కలెక్టర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించి, అంతక్రియలు జరిపారు. విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రేకు విద్యార్థి, యువజన సంఘాల నాయకులు వినతి పత్రం అందజేశారు.