- శైలజ కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్థుల డిమాండ్
- బాధిత కుటుంబానికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, విద్యార్థి సంఘాల బాసట
- ఒకరికి ఉద్యోగం, రెండు ఎకరాల భూమి, రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
కుమ్రంభీం ఆసిఫాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాల విద్యార్థిని, అదే మండలం సవాతి దాబా గ్రామానికి చెందిన శైలజ హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే. అదేరోజు రాత్రి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. మంగళవారం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, విద్యా ర్థి సంఘాలు, గ్రామస్థుల ఆందోళనల నడు మ అంత్యక్రియలు ముగిశాయి.
ఈ నేపథ్యం లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ఎస్పీలు గౌస్ ఆలం, శ్రీనివాసరావు ఎలాంటి అందోళనలు జరుగకుండా తమ బలగాలతో బందోబస్తు నిర్వహించారు. సోమవారం రాత్రి సవాతి దాబా గ్రామానికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే కోవలక్ష్మిని ఆమె ఇంటి వద్దే నిర్బంధించారు. మంగళవారం ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, పాల్వాయి హరీశ్‌బాబు సవాతి దాబా గ్రామానికి చేరుకున్నారు.
ఎమ్మెల్సీ దండే విఠల్, డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్‌రావు, గిరిజన సంక్షేమశాఖ డీడీ రమాదేవి విద్యార్థిని కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా శైలజ కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్థులతో పాటు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యుల్లో ఒక్కరికి ఉద్యోగం, ఐదెకరాల భూమి, రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఇందిరమ్మ ఇల్లు మం జూరు చేయానలి కోరారు.
ఒక్కరికి ఉద్యో గం, ఇందిరమ్మ ఇల్లు, రెండెకరాల భూమి, తక్షణ సాయం కింద రూ.1.20 సహాయం అందజేస్తామని ఎమ్మెల్సీ విఠల్ హామీ ఇచ్చారు. కాగా స్పష్టమైన హామీ ఇవ్వకున్నా పోలీసులు బలవంతంగా శైలజ మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించినట్లు పలు వురు ఆరోపించారు. స్పష్టమైన హామీ ఇవ్వాలని బుధవారం విద్యసంస్థల బందుకు పలు సంఘాలు పిలుపునిచ్చాయి. అనంతరం శైలజ అంత్యక్రియలు సాయంత్రం ఐదు గంటలకు నాటకీయపరిణామాల మధ్య ముగిశాయి.
అడుగడుగునా ఆంక్షలు
శైలజ మృతి చెందడంతో పోలీసులు ఆసిఫాబాద్ నుంచి వాంకిడి వరకు అడుగడుగునా తనిఖీలు చేపట్టారు. వాంకిడి నుంచి సవాతి గ్రామానికి వెళ్లే ప్రతి ఒక్కరిని క్షుణంగా పరిశీలించడంతో పాటు వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మీడియాను సైతం అనుమ తించలేదు. అర్లీ గ్రామ సమీపంలో మీడియా ప్రతినిధులను అడ్డుకున్నారు.
ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, పాల్వాయి హరిశ్‌బాబును సైతం మొదట పోలీసులు అడ్డుకున్నప్పటికీ వారు పోలీసులతో వారించి బలవంతంగా సవాతి చేరుకున్నారు. విద్యార్థి సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు, రాజకీయ నాయకులను ఎక్కడిక్కడే పోలీసులు అడ్డుకున్నారు.