26-03-2025 06:34:11 PM
కామారెడ్డి జిల్లా బిక్కనూరులో ఘటన..
కామారెడ్డి (విజయక్రాంతి): ఒకవైపు తండ్రి మరణం మరోవైపు 10వ తరగతి పరీక్ష తప్పనిసరి రాయాల్సిన పరిస్థితి. తండ్రి మరణ వార్తని గుండెల్లో ఒడిసి పట్టి లక్ష్యం కోసం ముందుకు సాగింది ఆ విద్యార్థిని. కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండల కేంద్రానికి చెందిన సత్యనారాయణ ఒక దిన పత్రికలో విలేకరిగా పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి అతనికి గుండెపోటు రావడంతో మృతి చెందారు. మృతుడికి భార్య ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఆయన కుమార్తె కావ్య శ్రీ లక్ష్యం సాధన కోసం అహర్నిశలు చదువుతూ పదవ తరగతి పరీక్షలకి సిద్ధం అయ్యింది.
బుధవారం గణిత పరీక్ష ఉండడంతో ఒకవైపు తండ్రి మరణ వార్త తెలిసి కూడా తండ్రి లేడనే వార్త గుండెల్లో దాచుకొని తన తండ్రి లక్ష్యం కోసం పరీక్ష హాల్ కెళ్ళి పరీక్ష రాసింది. అంత దుఃఖంలో కూడా తండ్రి ఆశయ సాధన కోసం ముందుకెళ్లిన ఆ చిట్టి తల్లికి అందరూ దైర్యం చెప్పారు. ఒక వైపు గుండెల నిండా భాద ఉన్న తన కోసం తన తండ్రి కలలు కన్నా జీవితం కోసం ముందుకెళ్లిన అమ్మాయిని చూసి ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామస్తులు ప్రముఖులు అభినందనలు చెప్తూ మరోవైపు ఓదార్చారు.