హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణలో భారీ పెట్టుబడులకు ఎస్టీటీ డాటా సెంటర్స్(STT Data Centres) ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) సారధ్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం(Telangana Rising Delegation) సింగపూర్(Singapore) పర్యటన సందర్భంగా మరో కీలకమైన ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో రూ. 3,500 కోట్ల పెట్టుబడులకు ఎస్టీ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్స్ ఇండియా (ST Telemedia Global Data Centres India)సంస్థ ముందుకొచ్చింది. ముచ్చర్ల – మీర్ఖాన్‌పేటలో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ క్యాంపస్(AI-Based Data Center Campus)ను స్థాపించేందుకు ఈ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్‌ను మంత్రి శ్రీధర్ బాబు సందర్శించి ఆ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు. అనంతరం పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్(Industries Department Special Chief Secretary Jayesh Ranjan), ఎస్‌టీటీ గ్రూప్ సీఈవో బ్రూనో లోపెజ్(STT Group CEO Bruno Lopez) ఎంవోయూపై సంతకాలు చేశారు. ఈ అవగాహన ఒప్పందంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ త్వరలోనే హైదరాబాద్ డేటా సెంటర్లకు రాజధానిగా అవతరిస్తుందని వ్యాఖ్యానించారు.
ముచ్చర్ల మీర్ ఖాన్ పేట్ లో డాటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన ఈ సంస్థ ఇప్పటికే హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో ఓ డాటా సెంటర్ ను నిర్వహిస్తుంది. రాష్ట్రంలో పెట్టుబడుల నిర్ణయం తీసుకున్నందుకు ఎస్టీటీ గ్లోబల్ కంపెనీ ప్రతినిధులను అభినందనలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఏఐ ఆధారిత రంగంలో వస్తున్న వినూత్న మార్పుల్లో హైదరాబాద్ డేటా సెంటర్ల హబ్‌గా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. 100 మెగావాట్ల సామర్థ్యంతో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే అత్యాధునిక ఏఐ రెడీ డేటా సెంటర్‌ను ఈ కంపెనీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నెలకొల్పనుంది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా డేటా సెంటర్ సామర్థ్యాన్ని పెంచుకునే సదుపాయం ఇందులో ఉంటుంది. దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్లలో ఇది ఒకటిగా నిలుస్తుంది. తెలంగాణతో కలిసి పని చేయటం గౌరవంగా ఉందని ఎస్టీటీ మీడియా గ్లోబల్ డేటా సెంటర్స్ ప్రెసిడెంట్, గ్రూప్ సీఈవో బ్రూనో లోపెజ్ అన్నారు. మౌలిక సదుపాయాలతో పాటు తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రగతిశీల విధానాలు సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహకంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం అందించే సహకారంతో ఆర్థిక వృద్ధితో పాటు ఉపాధి కల్పన, స్థిరమైన డిజిటల్ భవిష్యత్తు నిర్మించాలనే ఉమ్మడి లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. ప్రస్తుతం ఎస్టీటీ జీడీసీ (STT GDC) హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో డేటా సెంటర్‌ను నిర్వహిస్తోంది. కొత్త క్యాంపస్ ఏర్పాటుతో కంపెనీ కార్యకలాపాలను విస్తరించనుంది. ఈ కంపెనీ దేశంలో వచ్చే పదేండ్లలో దాదాపు 3.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో ఒక గిగావాట్ సామర్థానికి విస్తరించాలన్న లక్ష్యంతో పెట్టుబడులు పెడుతోంది.