calender_icon.png 19 January, 2025 | 12:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికలు జరిగే వరకు పోరాటం

18-01-2025 06:05:09 PM

పొలిటికల్ జేఎసి...

మందమర్రి (విజయక్రాంతి): పట్టణ మున్సిపలిటీ ఎన్నికలు  నిర్వహించేవరకు మున్సిపల్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో పోరాటాలు ఉదృతం చేస్తామని పొలిటికల్ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల సాధన కోసం బిజెపి, బిఆర్ఎస్, సిపిఐ, జనసేన, బిఎస్పి, కాంగ్రేసేతర పార్టీలన్నీ కలిసి సమైక్యంగా పోరాటం చేసి ఎన్నికలు జరిగే విధంగా కృషి చేస్తామన్నారు. మున్సిపాలిటీ ఎన్నికలు జరగాలంటే అన్ని పార్టీలు, అన్ని కుల సంఘాలు ఏకమై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తేనే ఎన్నికలు జరుగుతాయని దీనిలో భాగంగా పొలిటికల్ జేఏసీ ఉద్యమ బాట పట్టిందన్నారు. ఏజెన్సీ ప్రాంతమైన  మందమర్రి (వి) నీ గ్రామపంచాయతీగా చేసి గ్రామాభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని వారు స్పష్టం చేశారు.

ఏజెన్సీ ప్రాంతమైన మందమర్రి (వి)కి, పట్టణానికి న్యాయం జరగాలంటే 1950 యాక్ట్ ప్రకారం ఏజెన్సీ ప్రాంతంగా కేటాయించిన సరిహద్దులను గుర్తించి గ్రామపంచాయతీగా ప్రకటించి మిగతా పట్టణ ప్రాంతానికి మున్సిపల్ ఎన్నికలు జరిగే విధంగా కృషి చేస్తే పట్టణం అభివృద్ధి జరుగుతుందన్నారు. పొలిటికల్ జేఏసీగా ఎన్నికల అంశాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకు వెళ్లి మున్సిపల్ ఎన్నికలు జరిగే విధంగా రాజీలేని పోరాటం చేస్తామని వారు స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికలు జరిగే విధంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి మున్సిపాలిటీ ఎన్నికలు జరిగే విధంగా కృషి చేయాలని వారు కోరారు. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ ఈ నెల 20న మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందించడం జరుగుతుందని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందించి ఉద్యమం ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల సాధన కోసం అన్ని కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి పొలిటికల్ జేఏసీ పోరాటానికి మద్దతు ఇవ్వాలని వారు కోరారు.

పొలిటికల్ జేఏసీ కమిటీ ఎన్నిక....

పట్టణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ గా అందుగుల శ్రీనివాస్ ని ఎన్నుకున్నారు. కమిటీ కో కన్వీనర్లుగా మేడిపల్లి సంపత్, బండారు సూరిబాబు, సప్పిడి నరేష్, రంగు శ్రీనివాస్, కొంగల తిరుపతిరెడ్డి, ఎండి అబ్బాస్, ముల్కల్ల రాజేంద్రప్రసాద్, మాయ రమేష్, ఆసాది సురేష్ రాయబారపు వెంకన్న, ఎంఎ రసూల్ లు ఎన్నికయ్యారు.