calender_icon.png 15 January, 2025 | 3:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్యులు, సిబ్బందికి పటిష్ఠ బందోబస్తు

03-09-2024 01:10:20 AM

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

హైదరాబాద్, సెప్టెంబర్ 2(విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుప్రతులు, మెడికల్ కాలేజీల్లో వైద్యులు, సిబ్బందికి భద్రతను కట్టుదిట్టం చేసేందుకు నిబంధనలు రూపొందించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మహిళా వైద్యులు, నర్సింగ్ ఆఫీసర్లు, సిబ్బందికి రక్షణగా రాత్రి సమయాల్లో షీ టీమ్స్‌తో పెట్రోలింగ్ చేసేలా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. సచివాలయంలోని తన ఛాంబర్ లో మంత్రి సోమవారం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ.. అన్ని టీచింగ్ హాస్పిటళ్లలో శాశ్వత ప్రాతిపదికన అవుట్ పోస్టుల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని  అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మి స్తున్న టిమ్స్ ఆసుపత్రుల్లో ఇప్పటికే పోలీస్ అవుట్ పోస్టుల నిర్మాణానికి స్థలాన్ని కేటాయించామన్నారు. రాష్ర్టంలో అన్ని స్థాయిల ఆస్పత్రుల్లో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు సీసీ కెమెరాలను స్థానిక పోలీస్ స్టేషన్‌లకు అనుసంధానం చేయాలన్నారు. భద్రతపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించాలని పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు నిబంధనల మేరకు ఆసుపత్రుల్లో మహిళా సిబ్బంది భద్రత కోసం హాస్పిటల్ సేఫ్టీ కమిటీని నియమించి, ఈ నెల 14 లోపు రిపోర్టు సమర్పించాలని ఆదేశించారు. వైద్యులు, నర్సుల భద్రతలో భాగంగా నమోదైన కేసులను యాక్ట్ 11 ఆఫ్ 2008 ప్రకారం రిజిస్టర్ చేయాలని ఈ సమీక్షలో నిర్ణయించారు. ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలను వెంటనే సమర్పించాలని మంత్రి అధికారులకు ఆదేశించారు.

ఉమ్మడి 10 జిల్లాల ప్రతిపాదికన ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి, కేసుల విచారణను వేగవంతం చేయాలన్నారు. ప్రతి ఆసుపత్రిలో సెక్యూరిటీ హౌజ్‌ను ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సమీక్షలో రాష్ర్ట హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా , తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ అనిల్ కుమార్, రాష్ర్ట ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్ వి కర్ణన్‌తో పాటు  తదితరులు పాల్గొన్నారు.