09-02-2025 01:00:45 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు కోపంగా ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజల్లో తిరిగే పరిస్థితులు లేవని, సీఎం కూడా సెక్యూరిటీ లేకుండా బయట తిరిగే అవకాశం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో శనివారం సిర్పూర్ కాగజ్‌నగర్, వికారాబాద్ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది.
కార్యకర్తలను ద్ధేశించి కేటీఆర్ మాట్లాడుతూ ఐరెన్‌లెగ్ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్‌కు గుండుసున్న తీసుకొచ్చారని విమర్శించారు. రేవంత్ సర్కార్ మాటల ప్రభుత్వమే గానీ.. చేతల ప్రభుత్వం కాదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. 140 ఎకరాల భూమి కోసం కొడంగల్‌లోని ఒక ఊరికి 450 మంది పోలీసులను సీఎం పంపించారని, తెలంగాణలో పేదవాళ్లు బతకొద్దా అని ప్రశ్నించారు.
ప్రజల ఆశీర్వాదంతో బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగజ్‌నగర్ పేపర్ మిల్లును తిరిగి ప్రారంభించేందుకు బీఆర్‌ఎస్ కృషి చేసినట్లు గుర్తుచేసుకున్నారు. అధికారం కోసం పార్టీ లు మారే అవకాశవాదుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్న మన పార్టీతో కలిసి పనిచేసేందుకు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ముందుకొచ్చారన్నారు.
తెలంగాణలో బీజేపీ నుంచి 8 మం ది ఎంపీలుగా గెలిపిస్తే, కేంద్రం రాష్ట్రానికి గుండుసున్నా ఇచ్చిందన్నారు. పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్రం తేల్చిచెప్పినా.. ఆ అంశంపై ఏ ఒక్క కాంగ్రెస్, బీజేపీ ఎంపీ నోరుమెదపడం లేదన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో భారీ సంఖ్యలో బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు.
అందినకాడికి దోపిడీ..
రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలోని మంత్రులు అందినకాడికి దోచుకుంటూనే ఉన్నారని, రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని సమూలంగా నాశనం చేశారని కేటీఆర్ ఆరోపిం చారు. 6 గ్యారంటీలు, అమలుకు సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్, వాటిని అమలుచేయలేక చేతులెత్తేసిందన్నారు. తిరిగి 15 ఏండ్ల వరకు తెలం గాణలో ఓట్లు అడిగే పరిస్థితిలో కాంగ్రెస్ ఉండదని తెలిపారు.
స్థానిక ఎన్నికల్లో టికెట్లు ఎవరికి దక్కినా పార్టీ విజయానికి కట్టుబడి పనిచేయాలని కోరారు. తెలంగాణలో ప్రస్తు తం బీఆర్‌ఎస్‌కు అనుకూలమైన వాతావర ణం ఉందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని చెప్పారు. బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో పని చేయాలని, లేకుంటే నష్టపోతామన్నారు.
బీజేపీ విజయంలో రాహుల్ కీలకపాత్ర
మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ పార్టీ పతనాన్ని ప్రారంభించిన రేవంత్‌రెడ్డి.. ఢిల్లీలోనూ అదే పరంపరను కొనసాగించారని, రాబోయే రోజుల్లోనూ ఇదే పరి స్థితి కొనసాగుతుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీ విజయాలలో రాహుల్‌గాంధీ కీలకపాత్ర పోషిస్తున్నారని, ప్రధాని నరేంద్ర మోదీ రాహుల్ గాంధీనే అతిపెద్ద కార్యకర్త అని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతుబంధుకు రామ్‌రామ్ పెడతారని కేసీఆర్ ముందే హెచ్చరించారని గుర్తుచేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్, రేవంత్‌రెడ్డి సూచనలతోనే సభ నడిపిస్తున్నారని ఆరోపించారు. వందశాతం రుణమాఫీ జరిగిందని ఏ ఒక్క ఊర్లోనైనా రైతులు చెబితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అసెంబ్లీలోనే తాను చెప్పానని, ఇప్పుడు కూడా అదే మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.