29-03-2025 08:09:56 PM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టడంతో పాటు ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో అదనపు ఎస్పి ప్రభాకర్ రావు, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు లతో కలిసి జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశంలో రోడ్డు ప్రమాదాల నివారణపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారుల సమన్వయంతో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
జిల్లాలోని జాతీయ రహదారి, ప్రధాన రహదారులపై ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని, రహదారి మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. పట్టణాలలో, ప్రధాన రహదారులపై ప్రమాదాలు జరిగే చోట వేగ నియంత్రణలను ఏర్పాటు చేయాలని, మంచిర్యాల నుండి వచ్చే దారిలో ఆసిఫాబాద్ పట్టణ ముఖద్వారం వద్ద సుందరీ కరణ పనులు చేపట్టాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలని, పాఠశాల విద్యార్థులకు రహదారి భద్రత నియమాలపై అవగాహన తరగతులు, వ్యాసరచన పోటీలు నిర్వహించాలని తెలిపారు.
ప్రమాదాల నివారణలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టి విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించాలని, ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్, కారు ఇతర భారీ వాహనాలు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మైనర్లు వాహనాలు నడపకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, రహదారులపై ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించేలా అంబులెన్స్ లను ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లాలో ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్ లుగా గుర్తించాలని, జాతీయ రహదారికి ఇరువైపులా గ్రామాలలో సర్వీస్ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం పనులు త్వరగా పూర్తిచేసేలా జాతీయ రహదారుల సంస్థ అధికారులు సంబంధిత అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ప్రధాన రహదారుల ప్రక్కన గల విద్యుత్ స్తంభాలపై రేడియం అతికించాలని, జాతీయ రహదారులపై గల డివైడర్ల పై నుండి ఎడ్ల బండ్లు, ద్విచక్ర వాహనాలు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి రామ్ చందర్, రోడ్లు భవనాల శాఖ అధికారి సురేందర్, విద్యుత్ శాఖ ఎస్.ఈ. శేషరావు, జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి, గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సీతారాం, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.