- 300కు పైగా లైసెన్స్ లేని కల్లు షాపులు
- డైజోఫాన్‌ను అధిక మోతాదులో కలుపుతున్న వ్యాపారులు
- పీరంపల్లిలో పెరుగుతున్న కల్తీ కల్లు బాధితులు
వికారాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లాలో కల్తీ కల్లు దందా జోరుగా సాగుతున్నది. అనుమతులు లేని కల్లు దుకాణాలే ఎక్కువగా ఉన్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లాలో 341 కల్లు దుకాణాలకు లైసెన్స్‌లు ఉన్నాయి. ఇవి అధికారిక లెక్కలు మాత్రమే. లైసెన్సు లేని దుకాణాలు 300లకు పైగా ఉంటాయి. జిల్లాలోని 565 గ్రామ పంచాయతీలు ఉండగా.. పంచాయతీకో కల్లు దుకాణం నడుస్తున్నది.
పెద్ద గ్రామాల్లో రెండు నుంచి మూడు కల్లు దుకాణాలు ఉన్నాయి. ఒక కల్లు దుకాణానికి లైసెన్సు పొందిన వ్యాపారులు దానిమీదనే రెండు, మూడు షాపులు నడిపిస్తున్నారు. ఎక్సైజ్ అధికారుల అండతోనే ఈ దందా నడుస్తున్నట్టు తెలుస్తున్నది. పీరంపల్లిలో కొనసాగుతున్న కల్లు దుకాణం ఇలాంటిదే. లైసెన్స్ లేకుండా 8 ఏళ్లుగా ఇక్కడ కల్లు వ్యాపారం సాగిస్తున్నారు.
రూ.కోట్లలో కల్తీ కల్లు వ్యాపారం
జిల్లాలో రూ.కోట్లలో కల్తీ కల్లు వ్యాపారం సాగుతున్నది. వ్యాపారులు కృత్రిమంగా కల్లును తయారు చేసి అమ్ముతున్నారు. అందుకు డైజోఫామ్‌ను అధిక మోతాదులో కలిపి కల్లు ప్రియులకు వ్యసనంగా మారుస్తున్నారు. కల్తీకల్లు వ్యాపారుల నుంచి ముడు పులు తీసుకుని ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.
పీరంపల్లిలో పెరుగుతున్న బాధితులు
పీరంపల్లి గ్రామంలో కల్తీ కల్లు ఘటన ఈ నెల 19న జరగగా బాధితులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ఇప్పటికే ఓ వ్యక్తి మృతిచెందగా, మరి కొందరి పిరిస్థితి విషమంగా ఉన్న ది. హైదరాబాద్, వికారాబాద్‌లోని పలు ఆసుపత్రుల్లో వంద మంది వరకు చికిత్స పొందుతున్నారు. ప్రశాంత్ అనే యువకుడికి కిడ్నీలు చెడిపోవడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుప త్రిలో డయాలసిస్ అందిస్తున్నారు. మరో ము గ్గురికి కూడా కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపడంతో వీరుకూడా హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు.
కల్లీకల్లు వ్యాపారులకు అధికారుల అండ!
పీరంపల్లిలో పరిస్థితి తీవ్రంగా ఉన్నా సంబంధిత ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. పీరంపల్లిని ఇప్పటి వరకు జిల్లా అధికారులుగానీ, ప్రజాప్రతినిధులుగానీ సందర్శిచకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పీరంపల్లి ఘటన జరిగిన ఐదు రోజులకు(శుక్రవారం) జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ కే విజయభాస్కర్ గౌడ్ విలేకరుల సమావేశం నిర్వహించి, కలుషిత తాగునీటితోనే అస్వస్థతకు గురయ్యారని చెప్పడంపై స్థానికంగా అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. ల్యాబ్‌కు పంపించిన కల్లు నమూనాల ఫలితాలు రాకముందే కల్తీ కల్లు కాదని ఎలా నిర్ధారిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
పీరంపల్లిలో తాగునీరు సురక్షతమే
పీరంపల్లికి సరఫరా అవుతున్న నీటిని ఘటన జరిగిన రోజు నుంచి ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు పరీక్షిస్తున్నారు. ప్రతి రోజు నీరు సురక్షతంగా ఉన్నట్లు వారి పరీక్షల్లో తేలుతున్నది. గ్రామస్థుల అస్వస్థతకు తాగునీరు కారణం కాదని వారు చెబుతున్నారు.
మా అమ్మను కాపాడాలి
మా అమ్మ(వెంకటమ్మ) పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. రాఖీ పౌర్ణమి రోజు రెండు గ్లాసు ల కల్లు తాగిం ది. ఆ తర్వాత రెండు రోజులుగా వాంతులు, విరేచనాలు అయ్యాయి. శనివారం ఉదయం నుంచి మరింత నీరసంగా మారి మాటలు కూడా రావడం లేదు. మా అమ్మ ఊళ్లోనే ఒంటరిగా ఉంటున్నది. మా అమ్మను అధికారులు, ప్రజాప్రతినిధులే కాపాడాలి.
సుశీల, బాధితురాలి కూతురు కల్తీ కల్లు కాకపోవచ్చు
పీరంపల్లిలో ప్రజలు అస్వస్థతకు గురికావడంతో వెంటనే అక్కడికి మా సిబ్బంది వెళ్లి కల్లు నమూనాలు సేకరించింది. వాటిని ల్యాబ్‌కు పంపించాం. కల్తీ కల్లు ప్రభావం ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. నాలుగైదు రోజులుగా ప్రజలు అస్వస్థతకు గురికావడంపై మాకు కొంత అనుమానం ఉంది. అస్వస్థతకు కారణం కలుషిత నీరు అయి ఉండవచ్చు. ల్యాబ్ ఫలితాలు వస్తేనే అసలు విషయం తెలుస్తుంది. కల్లు వ్యాపారిపై కేసు నమోదు చేశాం.
విజయభాస్కర్‌గౌడ్,
ఎక్సైజ్ సూపరింటెండెంట్, వికారాబాద్ జిల్లా