11-03-2025 04:30:47 PM
గీతం-పైటెక్ వ్యూహాత్మక భాగస్వామ్యం
అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేసిన రెండు సంస్థల ప్రతినిధులు
సంగారెడ్డి, (విజయక్రాంతి): హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, బెంగళూరులోని పైటెక్ ఎంబెడెడ్ సిస్టమ్స్ తో అధికారికంగా అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఇది విద్యా సహకారం, పరిశోధన, సాంకేతిక ఆవిష్కరణలను పెంపొందించడంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఈ ఒప్పందంపై మంగళవారం రెండు సంస్థల కీలక ప్రతినిధులు- గీతం ప్రోవీసీ ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వీ.ఆర్.శాస్త్రి, పైటెక్ డైరెక్టర్-సేల్స్ అరుణ్ కుమార్, మార్కెటింగ్ చీఫ్ మురగన్ రంగనాథన్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ‘ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ ఇండస్ట్రీ 4.0’పై దృష్టి సారించే రెండు రోజుల విద్యార్థుల కార్యశాలను కూడా వారు ప్రారంభించారు.
అరుణ్ కుమార్ తన ప్రసంగంలో, విద్యారంగం, పరిశ్రమ మధ్య అంతరాన్ని తగ్గించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, ఈ భాగస్వామ్యం ద్వారా విద్యలో స్పష్టత, సాంకేతికత యొక్క ఆచరణాత్మక అనువర్తనాన్ని పెంచడానికి తాము చేతులు కలుపుతున్నట్టు చెప్పారు. వర్థమాన ఇంజనీర్లను ప్రోత్సహించడం, వారి వ్యవస్థాపక ప్రయత్నాలలో మద్దతు ఇవ్వడం తమ లక్ష్యంగా ఆయన పేర్కొన్నారు. ఇది కేవలం ఒక అవగాహన ఒప్పందమే కాదని, దీని ద్వారా విద్యార్థులను ఆవిష్కరణ, శ్రేష్ఠత వైపు నడిపిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ వీ.ఆర్.శాస్త్రి ఈ అవగాహనపై హర్షాన్ని వ్యక్తంచేస్తూ, ఇది కేవలం అధికారిక ఒప్పందం కంటే ఎక్కువగా ఉండేలా చూసుకోవడంతో పాటు, విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు- అన్ని స్థాయిలలో దీనిని అమలు చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.
ఈ భాగస్వామ్యం ఈఈసీఈ విభాగంలోనే కాకుండా గీతంలోని అన్ని విభాగాలలో పరిశోధన సంస్కృతిని మారుస్తుందని అభిలషించారు. బీ.టెక్. విద్యార్థులకు ప్రాజెక్టులు, ఎం.టెక్. విద్యార్థులకు పరిశోధనా పనిలో మద్దతు ఇవ్వడానికి పైటెక్ సిద్ధంగా ఉందని ప్రొఫెసర్ శాస్త్రి వెల్లడించారు. ఇది విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించే, సైద్ధాంతిక జ్జానాన్ని ఆచరణాత్మక అనువర్తనంతో అనుసంధా నించే ప్రత్యక్ష, పనిచేసే అవగాహనా ఒప్పందంగా ప్రొఫెసర్ డీ.ఎస్.రావు అభివర్ణించారు. జీవితాంతం నేర్చుకుంటూనే ఉండాలని, పరిశ్రమ పురోగతికి తగ్గట్టుగా ఎదగాలని ఆయన విద్యార్థులను ప్రోత్సహించారు. తొలుత, ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టి.మాధవి స్వాగత వచనాలతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
ఈ అవగాహన మేరకు, పైటెక్ గీతంలో ఒక సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను ఏర్పాటు చేస్తుందని, ఇది శిక్షణ కార్యక్రమాలు, ఇంటర్న్ షిప్ అవకాశాలు, ఎంబెడెడ్ సిస్టమ్ లలో పరిశోధనకు వెసులుబాటు కల్పిస్తుందన్నారు. కార్యక్రమ నిర్వాహకుడు ప్రొఫెసర్ పి.త్రినాథరావు వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది. ఈ భాగస్వామ్యం గీతంలో విద్యా అనుభవాన్ని మెరుగుపరచడం, వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు తగ్గట్టు అభివృద్ధి చెందడానికి అవసరమైన నైపుణ్యాలు, జ్జానంతో విద్యార్థులను సన్నద్ధం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.