calender_icon.png 1 November, 2024 | 8:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోగులకు మెరుగైన సేవలందించేందుకు కృషి

05-07-2024 12:15:49 AM

తెల్లాపూర్‌లో కొత్తగా దవాఖాన నిర్మిస్తాం

సంగారెడ్డి జెడ్పీ సర్వసభ్య సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహ

సంగారెడ్డి, జూలై 4 (విజయక్రాంతి): ప్రభుత్వ దవాఖానలకు వచ్చే రోగులకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువా రం సంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. సంగారెడ్డి పట్టణానికి రింగ్ రోడ్డు నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, కేంద్రంలో ప్రతిపాదనలు వెంటనే ఆమోదించేందుకు జహీరాబాద్, మెదక్ ఎంపీలు కృషి చేయాలని కోరారు.

తెల్లపూర్‌లో కొత్తగా దవాఖాన ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులకు నిధుల కొరత ఉన్నప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సంగారెడ్డి జిల్లాకు ఐఐటీ, జేఎన్‌టీయూ, మెరుగైన వైద్య సేవలు చేసేందుకు దవాఖానలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. సింగూర్ నీటిని సాగుకు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేసిందని, ప్రస్తుతం సాగు నీటి కాల్వలకు సిమెంట్ లైనింగ్ పనులు చేసేందుకు రూ.170 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. పదవిలో ఉన్నా లేకున్నా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. 

వైద్యులు ఉండడం లేదు..

కాగా, జహీరాబాద్, నారాయణఖేడ్‌లోని సర్కార్ దవాఖానల్లో వైద్యులు అందుబాటులో ఉండడం లేదని ఎమ్మెల్యేలు కొనింటి మాణిక్‌రావు, డాక్టర్ సంజీవరెడ్డిలు సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి తీసుకొచ్చారు. నారాయణఖేడ్ దవాఖానలో రోగులకు మందులు సైతం సరఫరా చేయడం లేదన్నారు. వెంటనే స్పందించిన మంత్రి జిల్లాలో మందుల కొరత ఎందుకు ఉందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి గాయత్రిదేవిని ప్రశ్నించారు. రాష్ట్రంలో మందులు పంపిణీ చేసేందుకు 22 పంపిణీ కేంద్రాలు ఉన్నాయని, ఎక్కడా మందుల కొరత రాకుండా చూడాలని ఆదేశించారు. కాగా, కంగ్టి పీహెచ్‌సీ స్థాయిని పెంచేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి కోరారు. నర్సాపూర్‌లో ఉన్న దవాఖానలో డాక్టర్లు లేక రోగులకు వైద్యం అందడం లేదని ఎమ్మెల్యే సునీతా రెడ్డి మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. 

సమావేశంలో న్యాల్‌కల్ జెడ్పీటీసీ స్వప్నభాస్కర్ మాట్లాడుతూ.. జహీరాబాద్ సర్కార్ దవాఖానలో గుండె చికిత్స వైద్యులు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జహీరాబాద్‌లోని గిరిజన తండాలకు బీటీ రోడ్లు వేసేందుకు నిధులు మంజూరు చేయాలని జెడ్పీ సభ్యుడు నాగిశెట్టి రాథోడ్ కోరారు. కాగా, జెడ్పీటీసీల పదవీ కాలం ముగిసిపోవడంతో వారిని ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. జహీరాబాద్, మెదక్ ఎంపీలు సురేశ్ షెట్కార్, రఘునందన్‌రావు, జహీరాబాద్, నారాయణఖేడ్, సంగారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, సంజీవరెడ్డి, చింత ప్రభాకర్, సునీతారెడ్డి, కలెక్టర్ క్రాంతి వల్లూర్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జెడ్పీ సీఈవో జానకిరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమర్, జెడ్పీటీసీలు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.