calender_icon.png 30 April, 2025 | 6:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మే 7 నుంచి ఆర్టీసీలో సమ్మె సైరన్

30-04-2025 12:37:29 AM

యాజమాన్యానికి ఆర్టీసీ జేఏసీ నోటీసులు

హైదరాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. మే 7వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లనున్నట్లుగా పేర్కొంటూ ఆర్టీసీ జేఏసీ  మంగళవారం ఆర్టీసీ ఎండీ, లేబర్ కమిషనర్‌కు సమ్మె నోటీసులు ఇచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. తమ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న సర్కారును డిమాండ్ చేశారు.

అంతకుముందు నారాయణగూడలోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఆర్టీసీ కార్మిక జేఏసీ సమావేశంలో పలు కేంద్ర కార్మిక సంఘాలతో కలిసి సమావేశం ఏర్పాటు చేసింది. అన్ని సంఘాలు సమ్మెకు మద్దతివ్వాలని తీర్మానించాయి. అనంతరం సమ్మెకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను జేఏసీ విడుదల చేసింది. మే 5వ తేదీన ఆర్టీసి కార్మికులతో ఆర్టీసీ కళ్యాణమండపం నుంచి బస్‌భవన్ వరకు భారీ కవాతు నిర్వహిస్తామని ప్రకటించింది.

యూనియన్‌లకు అతీతంగా అందరు సమ్మెకు కలిసి రావాలని ఈదురు వెంకన్న కోరారు. ఆర్టీసీ విలీన ప్రక్రియ వేగవంతం చేయడంతో పాటు ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ యాజమాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. 2021 వేతన సవరణ, పెండింగ్ బకాయిల చెల్లించాలన్నారు. ఆర్టీసీలో 16 వేల మంది రిటైరయ్యారని.. ఆ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు.