మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో విస్తృత తనిఖీలు
ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు
మణుగూరు: మావోయిస్టు వారోత్సవాలు, ములుగులో ఏడుగురు మావోయిస్టుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రాజ్ కుమార్ తన సిబ్బందితో పాటు టిఎస్‌ఎస్పీ సిబ్బందితో కలిసి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఈ బయ్యారం ఎక్స్ రోడ్డు వద్ద, మల్లారం, జానంపేట, దుగినెపల్లి, పలు ప్రాంతాలలో సోమవారం వాహనాల తనిఖీ చేపట్టారు. వ్యక్తుల వివరాలు తెలుసుకుంటూ వారి వెంట ఉన్న వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆకస్మిక తనిఖీలు, ఆర్‌ఓపి, ఏరియా డామినేషన్ నిర్వహించడం జరుగుతుందన్నారు.
తమ నివాస ప్రాంతాల్లో ఎవరైన కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించినట్లయితే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. మండలంలో ఉన్న అటవీ గ్రామాల నుండి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ ఉన్నామని అనుమానిత వ్యక్తులు ఎవరైనా గిరిజన గూడెల్లోకి వస్తే ఆశ్రమం కల్పించొదని సూచించారు. గోదావరి పరీవాహక ప్రాంతమైన ఫెర్రీ పాయింట్స్ వద్ద కట్టుదిట్టమైన నిఘాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.