calender_icon.png 28 November, 2024 | 1:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పకడ్బందీగా పునరావాస ప్రక్రియ

23-11-2024 12:00:00 AM

  1. టైగర్ రిజర్వ్‌లతో తెలంగాణకు ప్రత్యేకత 
  2. అటవీశాఖ మంత్రి కొండా సురేఖ 

 హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి): అమ్రాబాద్ టైగర్ రిజర్వు, కవ్వాల్ టైగర్ రిజర్వుల పరిధిలో గ్రామాల తరలింపులో ప్రజలకు ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని కల్పిస్తూ పకడ్బందీగా పునరావాస ప్రక్రియను చేపట్టాలని   అధికారులను అటవీశాఖ మంత్రి సురేఖ ఆదేశించారు.

టైగర్ రిజర్వులు తెలంగాణకు ప్రత్యేకతను చేకూర్చాయని, వాటిని ప్రత్యేకతను కాపాడేందుకు అటవీశాఖ నిరంతర చర్యలు చేపట్టాలని సూచించారు. మంత్రి సురేఖ నేతృత్వంలో శుక్రవారం అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌ల గవర్నింగ్ బాడీస్ సమావేశం సచివాలయంలో జరిగింది. ఈ సందర్భంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో చేపడుతున్న గ్రామాల తరలింపు ప్రక్రియపై సురేఖ ఆరా తీశారు.

అమ్రాబాద్ టైగర్ రిజర్వు పరిధిలో 26 కోర్ (కేంద్రీకృత) గ్రామాలుండగా, ప్రస్తుతం వాటిలో 4 గ్రామాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లు అధికారులు వివరించారు. అతిపెద్ద కోర్ ఏరియా కలిగిన రెండో టైగర్ రిజర్వుగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ నిలవడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

అమ్రాబాద్ పరిధిలో దాదాపు 20 శాతం ప్రాంతాన్ని పర్యాటక అవసరాలకు వినియోగించుకుని, మన్నన్నూర్, మద్దిమడుగు, సోమశిల, దోమలపెంట ఎకో టూరిజం సర్క్యూట్లలో ప్రస్తుతం పర్యాటక సేవలు అందిస్తున్నట్లు అధికారులు వివరించారు.

స్థానిక యువతకు శిక్షణనిచ్చి ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. పునరావాస ప్రక్రియలో భాగంగా కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోని మైసంపేట్, రాంపూర్ గూడేలను తొలి విడతగా ఖాళీ చేయించినట్లు అధికారులు వివరించారు.

ఎకో టూరిజం సర్క్యూట్లు

 పునరావాస కుటుంబాలకు శాశ్వత పట్టాలు, రాకపోకల నిమిత్తం గ్రీన్ పాసులు అందించాలని, స్కూల్‌ను ఏర్పాటు చేయాలని మంత్రి సురేఖను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు కోరారు. ప్రభుత్వ ప్రతిష్ట పెరిగే విధంగా పునరావాస చర్యలు చేపట్టాలని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ కోరారు. అటవీ ఉత్పత్తులను సేకరించే స్థానికులపై మానవత్వం చూపాలని అధికారులకు  మంత్రి సూచించారు.

సోమశిల, అమరగిరి ఎకో టూరిజం సర్క్యూట్, దోమలపెంట -శ్రీశైలం ఎకో టూరిజం సర్క్యూట్ లను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు మంత్రి సురేఖకు అధికారులు తెలిపారు. తెలంగాణ అమర్‌నాథ్‌గా ప్రసిద్ధిగాంచిన సలేశ్వరం జాతరను  సర్క్యూట్ లలో చేర్చాలని మంత్రి ఆదేవించారు.

వన్యప్రాణుల దాడుల ఘటనల్లో మరణించిన వారికి ఇచ్చే  నష్టపరిహారాన్ని రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు సురేఖ తెలిపారు.

సమావేశంలో ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, వెడ్మా బొజ్జు, రేకుపల్లి భూపతి రెడ్డి, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్, పీసీసీఎఫ్ (వైల్డ్ లైఫ్) ఏలూసింగ్, డీసీసీఎఫ్ ఆంజనేయులు(హెడ్ ఆఫీస్), సీఎఫ్, ఎఫ్ డీపీటీ  రాంబాబు, సీఎఫ్, ఎఫ్ డీపీటీ శాంతారాం, రోహిత్, బాజీరావ్ పాటిల్, రాజశేఖర్,శివాశిశ్, ఎఫ్‌డీవో రామ్మూరి ్త, ఓఎస్డీ శంక రన్ తదితరులు పాల్గొన్నారు