calender_icon.png 23 March, 2025 | 9:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదక ద్రవ్యాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు

21-03-2025 12:17:50 AM

మెదక్, మార్చి 20(విజయక్రాంతి): జిల్లాలో మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై విస్తృత ప్రచారం చేస్తూ, నియంత్రణకు పక్కా కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో మాదక ద్రవ్యాల, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తో కలిసి సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా నార్కోటిక్ కంట్రోల్ సమావేశంలో జిల్లాలో నమోదవుతున్న ఎన్.డి.పి.ఎస్ కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాదక ద్రవ్యాల వాడకం, నియంత్రణ చర్యలు, మాదక ద్రవ్యాల నివారణ కోసం శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి చేయాల్సిన విస్తృత ప్రచారం వంటి పలు అంశాలపై చర్చించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాలు సరఫరా చేసే వారిపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తూ చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగిందని, యువత డ్రగ్స్ కు ఆకర్షితులైతే దేశ భవిష్యత్తు నాశనం అవుతుందని, దీనిని గుర్తించి డ్రగ్స్ వల్ల కలిగే విపరీత పరిణామాలపై అవగాహన వివరిస్తూనే సమాంతరంగా వాటి నియంత్రణకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని అన్నారు. జిల్లాలోని ఆసుపత్రులు, మెడికల్ షాపులలో స్టాక్ వివరాలను ప్రతి నెల తనిఖీ చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మన జిల్లాలో గంజాయి నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని తెలిపారు. గంజాయి అరికట్టేందుకు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని, అదే సమయంలో డ్రగ్స్, గంజాయి వల్ల కలిగే నష్టాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని అన్నారు.