calender_icon.png 24 October, 2024 | 2:03 PM

వీధి కుక్కల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి

08-08-2024 03:07:26 PM

డంపింగ్ యార్డులో నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్ ను వినియోగంలోకి తీసుకురావాలి

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి..

వనపర్తి (విజయక్రాంతి) : వీధి కుక్కల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మున్సిపాలిటీ అధికారులను ఆదేశించారు. గురువారం వనపర్తి పట్టణంలోని నాగవరం శివారు ఉరగుట్ట వద్ద కొత్తగా నిర్మితమైన జంతు జనన నియంత్రణ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ తో కలిసి పరిశీలించారు. జిల్లాలో వీధి కుక్కల సంతతిని తగ్గించడానికి రోజుకు కనీసం 10 కుక్కలకు  జనన నియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహించాలని సూచించారు. జిల్లాలోని నలుమూలల నుండి వీధి కుక్కలను తీసుకు వచ్చి సురక్షితమైన పద్ధతిలో శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు ఎనిమల్ వెల్ఫేర్ కేర్ సెంటర్  ఏజెన్సీతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు అవసరమైన సదుపాయాలు, సిబ్బందిని సమకూర్చుకోవాలని మున్సిపల్ కమిషనర్, జిల్లా పశు సంవర్థక శాఖ అధికారిని సూచించారు. శస్త్ర చికిత్స అనంతరం వారం రోజులు అక్కడే వాటి ఆరోగ్య సంరక్షణ చేసేవిధంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. శస్త్ర చికిత్సలు ఈ రోజు నుండి ప్రారంభించాలసి సూచించారు. 

డంపింగ్ యార్డులో నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్ ను వినియోగంలోకి తీసుకురావాలి

సెగ్రిగేషన్ షెడ్ ను తక్షణమే వినియోగంలోకి తీసుకురావాలని, తడి చెత్త, పొడి చెత్త ను వేరు చేసి ప్లాస్టిక్ ను అమ్మేయడంతో పాటు తడి చెత్త నుండి సేంద్రియ ఎరువులు తయారు చేయాలని సూచించారు.  మున్సిపాలిటీ నుండి రోజుకు ఉత్పత్తి అయ్యే చెత్త ఎంత, ఎన్ని క్వింటాళ్ల చెత్తను సేకరిస్తున్నారు అనే పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. అదేవిధంగా బయో మైనింగ్ ను త్వరగా  ప్రారంభించాలని ఆదేశించారు.  అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, జెడ్పి సీఈవో యాదయ్య, మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్,  జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డి తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.