04-04-2025 09:30:16 PM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయ క్రాంతి): యువత భవిష్యత్తుపై చెడు ప్రభావం చూపే మాదకద్రవ్యాల రవాణాపై జిల్లాలో కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం కలెక్టర్ లో అదనపు ఎస్పి ప్రభాకర్ రావు, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా లతో కలిసి నషా ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమిష్టిగా అందరూ కృషి చేసి నషా ముక్త్ జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. యువత చెడుదారులలో వెళ్లి జీవితాన్ని నాశనం చేసుకోవద్దన్నారు. గంజాయి పండించడం, రవాణా చేయడం, విక్రయించడం, సేవించడం వంటి వాటిపై ఉక్కు పాదం మోపాలని, ముఖ్యంగా రాత్రి సమయాలలో యువత గుంపుగా ఉన్న ప్రాంతాలపై నిఘా పెంచాలన్నారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
కిరాణా దుకాణాలు, బెల్ట్ షాపులు, మందుల దుకాణాలలో తనిఖీలు చేపట్టాలని, సరిహద్దు రాష్ట్రం నుండి అక్రమంగా జిల్లాలో రవాణా చేసే అవకాశం ఉన్నందున చెక్ పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. వసతి గృహాలు, కళాశాలలు, గురుకుల విద్యార్థులకు మాదకద్రవ్యాలు సేవించడం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. సోషల్ మీడియా, వివిధ ప్రచార, ప్రసార సాధనాల ద్వారా నషా ముక్త్ పై విస్తృత ప్రచారం నిర్వహించాలని, మాదకద్రవ్యాలు సేవించడం వల్ల ఆర్థిక స్థితి, కుటుంబ పరిస్థితి, వయసు, ఆరోగ్యం వంటి అంశాలపై చూపే చెడు ప్రభావం కారణంగా వ్యక్తి జీవితాన్ని కోల్పోతాడని అన్నారు. జిల్లాలో డ్రగ్స్ డి అడిక్షన్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సజీవన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తుకారాం సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.