calender_icon.png 13 April, 2025 | 8:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పక్కాగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు

28-03-2025 12:51:10 AM

అవగాహన కోసం సివిల్ రైట్స్ డే అమలు

జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్, మార్చి 27(విజయక్రాంతి) ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు న్యాయం అందించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్పష్టం చేశారు. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లాస్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగింది.

కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవోలు మెదక్ రమాదేవి, నర్సాపూర్ మహిపాల్ రెడ్డి, తూప్రాన్ జై చంద్రారెడ్డి, షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి శశికళ, గిరిజన సంక్షేమ అధికారి నీలిమ, డీఎస్పీ మెదక్ ప్రసన్నకుమార్, సంబంధిత విజిలెన్స్ కమిటీ సభ్యులతో అట్రాసిటీ కేసుల నమోదు, పురోగతి, బాధితులకు చెల్లించాల్సిన పరిహారం, తదితర అంశాలపై కమిటీ సభ్యులతో కలెక్టర్ చర్చించారు.

నమోదైన అట్రాసిటీ కేసులు, పరిష్కరించిన కేసులు, బాధితులకు అందిన పరిహారం వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సివిల్ రైట్స్ డే అమలు చేస్తున్నామని, క్షేత్రస్థాయిలో కేసు పూర్వపరాలు పరిశీలించి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని వివరించారు.

ఎస్సీ ఎస్టీ చట్టాల గురించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని, బాధితులకు పరిహారం అందించే విషయంలో నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. సబ్ డివిజన్ స్థాయిలో విజిలెన్స్ మానిటరింగ్ సమావేశాలు జరగాలని తెలిపారు. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, అట్రాసిటీ కేసుల విషయంలో శరవేగంగా చర్యలు తీసుకుంటున్నట్లువెల్లడించారు.