30-04-2025 01:15:20 AM
రాష్ర్ట రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): భూ భారతి నూతన ఆర్‌ఓఆర్ చట్టాన్ని పకడ్బందీగా, పారదర్శకంగా అమలు చేస్తామని, రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేదని, గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తామని రాష్ర్ట రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంగళవారం సైదాపూర్ మండల కేంద్రంలోని విశాల సహకార పరపతి సంఘం కళ్యాణమండపంలో, చిగురుమామిడి మండల కేంద్రంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులకు మంత్రి హాజరయ్యారు. మొదట పెర్కపల్లి-వెంకేపల్లి, పెర్కపల్లి-దుద్దనపల్లి రోడ్డుపై ఏడు కోట్ల రూపాయలతో హై లెవెల్ వంతెనల నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. సైదాపూర్ మండల కేంద్రంలో విశాల సహకార పరపతి సంఘం నూతన భవనాన్ని, కళ్యాణమంటపాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.
అనంతరం ఇదే మండపంలో ఏర్పాటు చేసిన భూభారతి నూతన రెవిన్యూ చట్టం అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ భూమి ఒక గౌరవంగా భావించే రైతుకు ధరణి వచ్చిన తర్వాత మనశ్శాంతి లేకుండా పోయిందని అన్నారు. ధరణి తెచ్చిన భూ వివాదాల కారణంగా రైతుల ఆవేదన, ఆక్రోశం తహసిల్దార్ పై దాడి చేసే వరకు వెళ్లిందని అన్నారు. ధరణి వ్యవస్థ వల్ల రైతు తన భూమిని తాను అమ్ముకునే పరిస్థితి లేదని అన్నారు. అధికారులను గత ప్రభుత్వం దొంగలుగా చిత్రీకరించి రాత్రికి రాత్రి వందల ఎకరాల భూములను వారి పేరు పైకి బదిలాయించుకున్నారని తెలిపారు.
30 సంవత్సరాల కింద ఉన్న భూములు విక్రయించి వెళ్లిపోయిన వారి పేర్లు ధరణిలో వచ్చాయని, దీనివల్ల అసలైన రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని సంకల్పంతో, భవిష్యత్తులో ఎలాంటి భూ సమస్యలు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం భూ భారతి నూతన రెవిన్యూ చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని తెలిపారు. జూన్ 2 నుండి ఈ చట్టం ద్వారా సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. ఈ చట్టం ద్వారా రైతులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య పరిష్కారం అవుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి భూమికి భూధార్ సంఖ్య కేటాయిస్తామని తెలిపారు. భూమికు సంబంధించిన రికార్డులన్నీ ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న రికార్డు చేయడం జరుగుతుందని వెల్లడించారు.
చెప్పిన పని చేయలేదని సాకుతో విఆర్‌ఓ వ్యవస్థను రద్దు చేశారని, భూముల హక్కులను కాపాడేందుకు గ్రామీణ రెవిన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తామని తెలిపారు. భూభారతి చట్టాన్ని పారదర్శకంగా, పకడ్బందీగా అమలు చేస్తామని అన్నారు. తెలంగాణలో రైతులకు చెందిన ప్రతి భూ సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ అవసరాలకు మాత్రమే వినియోగించాలని తెలిపారు. ఎవరైనా భూకబ్జాలకు పాల్పడి ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, తిరిగి ఆ భూములను ప్రజా అవసరాలకు వినియోగిస్తామని అన్నారు. రాష్ర్టంలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, దఫదఫాలుగా పేదలందరికీ ఈ పథకం వర్తింపజేయాలని అధికారులకు సూచించారు. హుస్నాబాద్ నియోజకవర్గం లో తాగు, తాగునీటి అవసరాలు పూర్తిగా పరిష్కరిస్తామని అన్నారు. సహకార పరపతి సంఘాలు సమర్థవంతంగా పనిచేస్తూ రైతు సమస్యలను పరిష్కరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయి, ఆర్టీవోలు మహేశ్వర్, రమేష్ బాబు, సహకార సంఘం చైర్మన్ కొత్త తిరుపతిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ సుధాకర్, డిసీఓ రామానుజాచార్య, డీఏవో భాగ్యలక్ష్మి, తహసిల్దార్లు రమేష్, మంజుల, ఎంపిడీవో యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.