calender_icon.png 31 March, 2025 | 2:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

21-03-2025 01:01:58 AM

ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ఖమ్మం, మార్చి -20 ( విజయక్రాంతి ):-రబీ మార్కెటింగ్ సీజన్ లో ఖమ్మం జిల్లాలో రైతులు పండించిన ధాన్యం మద్దతు ధరపై కొనుగోలు చేసేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.గురువారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డితో కలిసి 2024-25 రబీధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో  సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ గత ఖరీఫ్ సీజన్ లో ఖమ్మం జిల్లాలో విజయవంతంగా ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు.  ప్రస్తుత అంచనా ప్రకారం రబీ సీజన్ కు సంబంధించి లక్షా 85 వేల మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం, 73 వేల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం, మొత్తం 2 లక్షల 58 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయబోతున్నామని అన్నారు. జిల్లాలో మొత్తం 344 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, రైతులకు అనుకూలంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఉండాలని కలెక్టర్ తెలిపారు.

ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ చేసేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తెలిపారు.  దాన్యం కొనుగోలు కేంద్రాల ఇంచార్జి, సిబ్బందికి అవసరమైన శిక్షణ అందజేయాలని కలెక్టర్ సూచించారు. ధాన్యం నాణ్యత ప్రమాణాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు.జిల్లా సరిహద్దుల్లో అవసరమైన చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల నుంచి మనకు సన్న రకం వడ్లు రాకుండా చూడాలని అన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అవసరమైన మౌళిక వసతులు కల్పించాలని, ప్యాడీ క్లీనర్, వేయింగ్ యంత్రాలు, తేమ యంత్రాలు, మొదలగు వసతులు కల్పించాలని అన్నారు.ఈ సమావేశంలో డిఆర్డిఓ సన్యాసయ్య, జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ జి. శ్రీలత, జిల్లా మార్కెటింగ్ అధికారి ఎం.ఏ. అలీం, జిల్లా సహకార అధికారి గంగాధర్,  సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.