11-02-2025 11:20:28 PM
వ్యర్థాలను వేయడంతోనే సీవరేజ్ ఓవర్‌ఫ్లో జలమండలి..
హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): మ్యాన్‌హోళ్లలో వ్యర్థాలు వేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జలమండలి అధికారులు తెలిపారు. ఇటీవల జలమండలి ఓఅండ్‌ఎం డివిజన్ సీవరేజీ ఓవర్‌ఫ్లో సమస్యను స్పెషల్ డ్రైవ్‌లో అధికారులు పరిష్కరించారు. అయినప్పటికీ మళ్లీ సమస్య పునరావృతం కావడంతో వ్యర్థాలను వేయడంతోనే సీవరేజ్ ఓవర్‌ఫ్లో అవుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజల అవగాహన లేమితో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు. కొంతమంది ఇంట్లో వాడి పడేసిన వస్తువులు, కవర్లు, ఘనవ్యర్థాలను మ్యాన్‌హోళ్లలో వేస్తున్నారని పేర్కొన్నారు. ఘనవ్యర్థాలు మ్యాన్ హోళ్లలో కలువకుండా ఉండేందుకు సిల్ట్ ఛాంబర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
నిర్మించుకోని వారందరికీ నోటీసులు జారీ చేయాలని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి అధికారులకు సూచించారు. నిర్లక్ష్యం వహించిన వారి సీవరేజీ పైప్‌లైన్ కనెక్షన్ తొలగించాలని ఆదేశించారు. కాగా.. గతేడాది అక్టోబర్ 2న జలమండలి చేపట్టిన సీవరేజీ స్పెషల్‌డ్రైవ్ ద్వారా ఇప్పటివరకు 21,095ప్రాంతాల్లో 2,762కిలోమీటర్ల సీవరేజ్ పైప్‌లైన్, 2.18లక్షల మ్యాన్‌హోళ్లలో డీసిల్టింగ్ చేసినట్లు పేర్కొన్నారు. దీంతో సీవరేజీ స్పెషల్‌డ్రైవ్ ఫిర్యాదులు 30శాతానికి తగ్గాయని తెలిపారు.