ఆపరేషన్ చబుత్రలో సీఐ శశిధర్ రెడ్డి
మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని వివిధ కాలనీలలో యువకులు అర్థరాత్రి రోడ్లపై అకారణంగా కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి హెచ్చరించారు. శనివారం అర్థరాత్రి పట్టణంలో సర్కిల్ పరిధిలోని 5 గురు ఎస్సైలు, 25 మంది సిబ్బంది సహాయంతో మొత్తం 05 పెట్రోలింగ్ పార్టీలుగా పట్టణాన్ని అష్ట దిగ్బంధం చేశారు. రోడ్లపై అర్ధరాత్రి ఆవారాగా తిరుగుతూ అనుమానాస్పదంగా ఉన్న 35 మందిని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ చేశారు. వీరందరి నుంచి 15 బైకులు, 1 కార్ స్వాధీనం చేసుకున్నారు. తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన ముగ్గురిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. ఈ సందర్బంగా సీఐ మాట్లాడారు. అర్ధరాత్రి పట్టణంలోని పలు కాలనీలలో అరుగుల మీద బాతకానీలు చేస్తూ రోడ్లమీద ఇష్టానుసారం బైకులపై తిరుగుతూ కాలనీ వాసులను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. మద్యం సేవించి వాహనాలపై తిరుగుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతూ గొడవలు సృష్టిస్తున్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.