calender_icon.png 24 October, 2024 | 10:36 PM

ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు

24-10-2024 08:26:37 PM

అదనపు కలెక్టర్ దీపక్ తివారి

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో ఇసుక అక్రమ రవాణా పాల్పడితే కట్టిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) దాసరి వేణు, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావులతో కలిసి రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, గ్రామీణ నీటి సరఫరా, రవాణా, పంచాయతీరాజ్, మైనింగ్, భూగర్భ జల శాఖలతో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కమిటీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలోని వాగులు, నదుల నుండి ఇసుక అక్రమ రవాణాను ఆరికట్టే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

పేదవారి ఇండ్ల నిర్మాణం, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు, ప్రభుత్వం చేపట్టే పనుల కు మాత్రమే ఇసుక ఉచితంగా అందించడం జరుగుతుందని, జిల్లాలోని 10 మండలాలలోని గ్రామాలలో ఇసుక లభ్యం అవుతుందని తెలిపారు. ఈ క్రమంలో సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఇసుక రవాణా చేయడం నిబంధనల ప్రకారం నేరమని, ఈ సమయంలో విస్తృతస్థాయి తనిఖీలు నిర్వహించి అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను సీజ్ చేయాలని తెలిపారు. అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించాలని, పోలీస్, రెవెన్యూ, పంచాయితీరాజ్ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.

పెద్ద వంతెనలు, డ్యాములు, చెరువుల వద్ద 500 మీటర్ల లోపు సుఖ చేసినట్లయితే చర్యలు తీసుకోవాలని, జిల్లా నుండి మహారాష్ట్రలోని చంద్రపూర్, మంచిర్యాల, ఆదిలాబాద్ ప్రాంతాలకు ఇసుక తరలించే వాహనాలను తనిఖీ చేయాలని, రెబ్బెన, సిర్పూర్-టి, వాంకిడి, ఆసిఫాబాద్ లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇసుక డంప్ లను స్వాధీనం చేసుకొని బహిరంగ వేలం వేయాలని, అనుమతి లేని వాహనాలు ఇసుక తరలిస్తే జరిమానా విధించాలని తెలిపారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టే విధంగా పటిష్టమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ సహాయ సంచాలకులు గంగాధర్, డివిజనల్ పంచాయతీ అధికారి కుమార్ హుస్సేన్, వివిధ శాఖల అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.