ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్ ముజామిల్‌ఖాన్
- తక్కువ ధర చెల్లించే వ్యాపారులకు నోటీసులు
- అవసరమైతే లైసెన్సులు రద్దు చేస్తాం
- ఖమ్మం కలెక్టర్ ముజామిల్‌ఖాన్
- ఖమ్మం పత్తి మార్కెట్ తనిఖీ
ఖమ్మం, నవంబర్ 12 (విజయక్రాంతి): రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని, పత్తి పంటకు మద్దతు ధర కంటే తక్కువ చెల్లించే చర్యలను సహించేది లేదని ఖమ్మం కలెక్టర్ ముజామిల్‌ఖాన్ హెచ్చరించారు. మంగళవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పత్తి రైతులను కలిసి మద్దతు ధర గురించి అడిగి తెలుసుకున్నారు. వ్యాపారులు తక్కువ ధర చెల్లింస్తుండటంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తక్కువ ధరకు పంట కొనుగోలు చేసిన వ్యాపారులకు నోటీసులు జారీ చేయాలని, తేమ శాతం ప్రకారం రైతులకు ధర చెల్లించని పక్షంలో లైసెన్స్ రద్దు చేయాలని కలెక్టర్ మార్కెటింగ్ అధికారిని ఆదేశించారు. మార్కెట్ యార్డులో అవసరమైతే అదనంగా పది మంది సిబ్బందిని తేమ శాతం పరిశీలన కోసం విధుల్లో చేర్చుకోవాలని సూచించారు. రైతులకు మద్దతు ధరపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.
తేమ శాతం పరిశీలించకుండా కొనుగోలు చేయడానికి వీలు లేదని వ్యాపారులను హెచ్చరించారు. ప్రైవేట్ వ్యాపారుల కొనుగోలు ప్రక్రియను మార్కెటింగ్ అధికారులు నిరంతరం పరిశీలించాలని, రైతులకు మద్దతు ధర లభించేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.