19-04-2025 01:02:51 AM
కుల సంఘాలతో శాంతి సమావేశంలో ఎస్పీ పరితోష్ పంకజ్
సంగారెడ్డి, ఏప్రిల్ 18(విజయక్రాంతి) :కుల, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వాఖ్యలు చేసినా, పోస్ట్ లు పెట్టినా చట్టరిత్యా కఠిన చర్యలు తప్పవని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన కుల సంఘాల నాయకులతో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...శాంతి భద్రతల పరిరక్షణలో 24 గంటలు అందుబాటులో ఉంటానని తెలిపారు.
బీఆర్ అంబేద్కర్ భారత రాజ్యంగ నిర్మాత, ఆయన ఏ ఒక్క కులానికి, మతానికి, ప్రాంతానికి పరిమితమైన వారు కాదని, ఆయన భారతదేశానికే కాకుండా ప్రపంచ దేశాలకు సైతం మార్గదర్శకంగా నిలిచారని గుర్తు చేశారు. భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలకు లోబడి నడుచుకోవాలని సూచించారు. ఎవరైన చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
వివిధ సంఘాలకు చెందిన పెద్దలు గ్రామ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి, కమ్మునిటీ ప్రశాంతత గురించి, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, శాంతి భద్రతల పరిరక్షణలో జిల్లా పోలీసు శాఖ తరపున ఎల్లవేళలా సహాయ సహకారాలు అంధించడం జరుగుతుందని అన్నారు. కొందరు యువత ఏఐని చెడు మార్గాలలో వినియోగిస్తూ లేనిది ఉన్నట్టుగా వికృత ఫోటోలు తయారు చేసి, సోషల్ మీడియా ద్వారా పోస్టు చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని, అలాంటి వారిని ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
జిల్లా ఐటి సెల్ నుండి సోషల్ మీడియాపై నిరంతరం పర్యవేక్షణ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ పీస్ మీటింగ్లోఅదనపు ఎస్పీ ఎ.సంజీవ రావ్, ఎస్బీ, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్లు విజయ్ కృష్ణ, రమేష్, వివిధ సంఘాల నాయకులు అతిమెల మాణిక్యం, కూన వేణు, కొండాపురం జగన్, పి. దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.