05-04-2025 07:18:35 PM
నిర్వాహకులకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వార్నింగ్..
ఆదిలాబాద్ (విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా ఉన్న ధాబాలలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించిన కఠినంగా చర్యలు ఉంటాయని ఎస్పీ అఖిల్ మహాజన్ నిర్వాహకులకు వార్నింగ్ ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా జాతీయ రహదారిపై, అంతర్రాష్ట్ర రహదారిపై ఉన్న ధాబాల నిర్వాహకులు, ఓనర్లతో జిల్లా ఎస్పీ గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్ లో శనివారం సమావేశం నిర్వహించి, పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ముఖ్యంగా ధాబాలలో మద్యం సేవించడం, మద్యం అమ్మకం, గంజాయి, మాదకద్రవ్యాలు లాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించిన వారిపై కేసులు నమోదు చేస్తూ, ధాబాలను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు.
ధాబాలలో మద్యం సేవించడం వల్ల వాహన ప్రమాదాలు సంభవించి ప్రాణనష్టం పెరుగుతుందని ప్రమాదాల నివారణకు ఇలాంటి చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. ముఖ్యంగా ప్రతి ఒక్క ధాబాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కెమెరాలలో ధాబాలలో వస్తున్న వారు వెళ్తున్నవారు ధాబా పరిసర ప్రాంతాలు హైవే లాంటి ప్రదేశాలు పూర్తిగా నిక్షిప్తమయ్యే విధంగా చూసుకోవాలన్నారు. ధాబాకు వచ్చే ప్రతి వాహనం ధాబా పార్కింగ్ స్థలాలలో మాత్రమే వేచి ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్డుపై ధాబాలకు వచ్చే వాహనాలు పార్కింగ్ చేయరాదని తెలియజేశారు.
ధాబాలలో పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి వివరాలు సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఉండాలని వారి వేలిముద్రలను సంబంధిత పోలీస్ స్టేషన్లో నమోదు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఉట్నూరు ఎఎస్పీ కాజల్, ఆదిలాబాద్ డిఎస్పి జీవన్ రెడ్డి, డిసిఆర్బి డీఎస్పీ సిహెచ్ నాగేందర్, సిఐలు సాయినాథ్, ఫణిధర్, వెంకటేశ్వరరావు, భీమేష్, ఎస్ఐ లు మహేందర్, శ్రీకాంత్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.