27-03-2025 12:23:36 AM
హయత్ నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
ఎల్బీనగర్, మార్చి 26 : ప్రజలు తమ ఇంట్లోని చెత్తాచెదారం బహిరంగ ప్రదేశాల్లో వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హయత్ నగర్ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి హెచ్చరించారు. హయత్ నగర్ డివిజన్ లోని కమలా నగర్ లో ఖాళీ ప్రదేశాల్లో పక్కనే ఉన్న ఇండ్ల నుంచి చెత్తాచెదారం వెయడంతో దుర్వాసన వస్తుందని, పరిసర ప్రాంతాల్లో ఉండే చిన్నపిల్లలు అనారోగ్య బారిన పడుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి, శానిటేషన్ సిబ్బందితో కలిసి కమలానగర్ కాలనీలో పర్యటించారు.ఎవరైతే బహిరంగ ప్రదేశాల్లో చెత్తాచెదారం వేస్తున్నారో గుర్తించి, వారికి స్వచ్ఛతపై అవగాహన కల్పించారు.
బహిరంగ ప్రదేశాల్లో చెత్తాచెదారం వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా ఒకే బిల్డింగ్ లో ఓనర్స్, రెంటర్స్ ఉంటున్నప్పటికీ కేవలం ఓనర్స్ మాత్రమే చెత్తాచెదారాన్ని స్వచ్ఛ ఆటో లో వేస్తున్నారని, రెంటర్స్ మాత్రం కాలనీలోని ఖాళీ ప్రదేశాల్లో ఎక్కడపడితే అక్కడ వేస్తున్నారని తెలిపారు.దీనికి పూర్తి బాధ్యత ఓనర్లది మాత్రమే అని తెలిపారు. మరోసారి కాలనీవాసుల నుంచి శానిటేషన్ పై ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాలనీ సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడు ఉపేందర్ రెడ్డి, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు టీవీ రావు, ప్రధాన కార్యదర్శి సుబ్బారావు, శానిటేషన్ సూపర్ వైజర్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.