19-03-2025 06:39:28 PM
విచారణ పేరుతో దుర్భాషలాడిన రైల్వే ఎస్ఐ...
మృతుని భార్య భాగ్యలక్ష్మి..
మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని రామన్ కాలనీకి చెందిన నస్పూరి వినయ్ ఇటీవల ఆత్మహత్య చేసుకోగా వినయ్ మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుని భార్య నస్పూర్ భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్లో బుధవారం ఆమె కుటుంబ సభ్యులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తన భర్త ఆత్మహత్య చేసుకోవడానికి ఒడ్నాల శ్రీనివాస్ అతని భార్య ఒడ్నాల మమత ప్రేరేపించారని ఆమె స్పష్టం చేశారు. తన భర్త (మృతుడు వినయ్)ను మమత తన వలలో వేసుకుందని దానికి సంబంధించిన ఫోటోలను మీడియా ముందు ప్రదర్శించారు. ఒడ్నాల శ్రీనివాస్ అతని మిత్రులు నరేందర్, సురేందర్, రాజిరెడ్డి అనే వ్యక్తులు పలుమార్లు వినయ్ పై దాడి చేశారనీ భాగ్యలక్ష్మి విలపించింది.
తరచూ దాడులతో వినయ్ మానసికంగా తీవ్ర ఆవేదన చెందారని, ఈ నేపథ్యంలో పలుమార్లు వినయ్ ఆత్మహత్యయత్నం చేసుకోగా తాము అడ్డుకున్నామని తెలిపింది. అయినప్పటికీ వేధింపులు ఆగకపోవడంతో గతనెల వినయ్ ఆత్మహత్య చేసుకున్నట్లు భాగ్యలక్ష్మి స్పష్టం చేసింది. వినయ్ మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు స్పష్టం చేసింది. మంచిర్యాల రైల్వే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని, విచారణ పేరిట రైల్వే ఎస్ఐ సాక్షులను ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడారని ఆమే ఆరోపించారు. రైల్వే పోలీసుల తీరుపై ఆమె అనుమానం వ్యక్తం చేస్తూ రైల్వే పోలీస్ స్టేషన్ నుండి ఈ కేసును మందమర్రికి బదిలీ చేయాలనీ కోరారు. తమకు న్యాయం జరగకుంటే సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటామని మృతుని భార్య కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.