- అర్హత లేని వాహనాలు సీజ్, కేసులు నమోదు
- సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ
సిద్దిపేట, అక్టోబర్ 14 (విజయక్రాంతి): ఎలాంటి అర్హత లేకున్నా వీఐపీ సైరన్ (పోలీస్ సైరన్) వినియోగించడం చట్టవి రుద్ధమని సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ అన్నారు. సిద్దిపేటలో కొంతమంది రాజకీయ నాయకులు, వ్యాపారులు వారి వాహనాలకు పోలీస్ సైరన్ వినియోగిస్తున్నట్లు గుర్తించి సోమవారం సైరన్ భాగాలను తొలగించారు.
కమిషనర్ మాట్లాడుతూ.. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా అర్హతలేనివారి వాహనాలకు సంబంధించి సైరన్లు తొలగిస్తున్నామని.. ఇంకా ఎవరైనా ఇలాంటివి వినియోగిస్తే స్వచ్ఛందంగా తొలగించుకోవాలని ఆదేశించారు. ఇది మొదటి హెచ్చరికగా చర్యలు తీసుకోలేదన్నారు. ఇకనుంచి ఎవరైనా అర్హత లేకున్న పోలీస్ సైరన్ వినియోగించినట్లు తెలిస్తే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు.
కార్ డెకర్స్ నిర్వాహకులు, ఇతర దుకాణాలవారు పోలీసు సైరన్ బిగించినట్లు తెలిస్తే వారి దుకాణాలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే సిద్దిపేటలో చాలామంది తమ బైక్ లేదా కారుకు ప్రెస్, పోలీసు స్టిక్కర్లు వేసుకున్నట్లు తెలిసిందన్నారు.
పనిచేస్తున్న మీడియా సంస్థ ఐడీ కార్డు, అక్రిడేషన్ కార్డు కలిగి ఉన్నావారు మాత్రమే ప్రెస్ స్టిక్కర్, పోలీసులుగా ఉద్యోగం చేస్తున్నవారు మాత్రమే పోలీసు స్టిక్కర్ అతికించుకోవాలని అదేవశించారు. త్వరలోనే స్పెషల్ డ్రైవ్ నిర్వహించి స్టిక్కర్స్ వేసుకున్న ప్రెస్, పోలీసుల ఐడీ కార్డులను పరిశీలిస్తామని కమిషనర్ తెలిపారు.