10-02-2025 04:28:29 PM
టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండల కేంద్రంలోని కొత్తగూడెం ఇల్లందు ప్రధాన రహదారితో పాటు బోడు ఎక్స్ రోడ్డుకు ఇరువైపులా వాహనదారులు, వస్త్ర దుకాణదారులు, కూరగాయల షాపు యజమానులు, చిరు వ్యాపారస్తులతో పాటు పలు వ్యాపారస్తులు నిర్వహించే వారు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎంపీడీవో రవీందర్రావు, ఎస్సై పోగుల సురేష్ హెచ్చరించారు. ప్రధాన వీధుల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో సిబ్బందితో కలిసి సోమవారం పర్యటించారు. స్థానిక కొత్తగూడెం-ఇల్లందు ప్రధాన రహదారి ఇరువైపులు ఉన్న షాపుల ఎదుట నిలబెట్టిన వాహనదారులకు బోడు ఎక్స్ రోడ్డు కూడలి తదితర ప్రాంతాల్లో పర్యటించారు.
ముఖ్యంగా దుకాణాల ముందు ఇష్టానురీతిన వాహనాలు నిలిపి ఉంచడంతోనే ఇబ్బందులు ఎదురవుతున్నట్లు గుర్తించారు. దుకాణదారులకు ఒకటికి రెండుసార్లు హెచ్చరించి పద్ధతి మార్చుకోకుంటే కేసులు నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. కూరగాయల అమ్మే వాళ్ళు తమ కూరగాయలను రోడ్డుమీదికి రాకుండా సైడ్ డ్రైన్ కు లోపలే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. బస్సులు నిలిపే ప్రదేశాల వద్ద ఆటోలు ఇష్టా రీతిన నిలపడంతో ఇబ్బందులు ఎదురవుతాయని, ఆటోలు క్రమపద్ధతిలో తిరిగేలా చర్యలు తీసుకోనున్నట్లు వారికి తెలియజేశారు. అనంతరం గ్రామపంచాయతీ సెక్రటరీ దీప్తికి రెండు రోజులలో డ్రైనేజీ దాటి ఎవరైనా వ్యాపారం నిర్వహిస్తే నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రటరీ దీప్తి, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.