28-03-2025 10:02:13 PM
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
'విజయక్రాంతి' కథనానికి స్పందన
చెన్నూర్,(విజయక్రాంతి): జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం ఇసుక క్వారీతో వాహనదారులకు తప్పని ఇబ్బందులు పేరిట ప్రచురించిన కథనానికి స్పందించిన జిల్లా కలెక్టర్ శుక్రవారం కోటపల్లి మండలంలోని కొల్లూరు, బోరంపల్లి ఇసుక రీచ్ పాయింట్లతో పాటు చెక్ పాయింట్లను డిసిపి భాస్కర్, తహశిల్దార్ రాఘవేందర్ రావు, జైపూర్ ఎసిపి వెంకటేశ్వర్లు, సిఐ సుధాకర్ లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రభుత్వం తక్కువ ధరలో నేరుగా వినియోగదారునికి ఇసుకను అందించేందుకు చర్యలు తీసుకుంటుందని, ఈ క్రమంలో జిల్లాలో ఇసుక రీచ్ లను ఏర్పాటు చేసి తద్వారా ఇసుక రవాణా చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ క్రమంలో ఎవరైనా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడినట్లయితే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ఒక లోడర్ పని చేస్తుందని, కూలీల సంఖ్య తక్కువగా ఉండటంతో నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ఇసుక సరఫరా జరుగడం లేదని, ఈ క్రమంలో అదనపు లోడర్ను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రతి రోజు కనీసం 200కు తగ్గకుండా లారీలు తరలించాలని తెలిపారు. ఇసుక రీచ్లకు రాకపోకలు సాగించే లారీల కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు కలుగకుండా తగు చర్యలు తీసుకోవాలని, ఇసుక లోడింగ్లో జాప్యంతో రహదారిపై లారీలను నిలుపకుండా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఆ దిశగా సంబంధిత గుత్తేదారు తగు చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యం వహిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
అనంతరం తహశిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రిజిస్టర్లు, రికార్డులు పరిశీలించారు. అధికారులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన ఖచ్చితంగా పాటించాలని, వివిధ ధృవపత్రాల కొరకు వచ్చే దరఖాస్తులు నిబంధనలకు లోబడి పరిశీలించి నిర్ణీత గడువులోగా జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను సంబంధిత అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆసుపత్రిలో వార్డులు, ల్యాబ్, మందుల నిల్వలు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు.
ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలని, ఆ దిశగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని, వేసవిలో వడదెబ్బకు గురి కాకుండా పాటించవలసిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాలని తెలిపారు. వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజలకు వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి లక్ష్మయ్య, చెన్నూర్ రూరల్ సీఐ సుధాకర్, ఉప తహశిల్దార్ నవీన్, పంచాయతీ కార్యదర్శి బొల్లం సందీప్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.