- అధికారులు సహకరిస్తే చట్టపరమైన చర్యలు
- విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కమిషనర్ ఎస్వీ రంగనాథ్
ఎల్బీనగర్/ అబ్దుల్లాపూర్‌మెట్, జూలై 19: చెరువులను కబ్జా చేసేవారితో పాటు వారికి సహకరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కమిషనర్ ఎస్వీ రంగనాథ్ స్పష్టం చేశారు. నాగోల్ డివిజన్‌లోని ఫతుల్లాగూడ చెరువు కబ్జాకు గురవుతుందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం చెరువు ప్రాంతాన్ని పరిశీలించారు. ఫతుల్లాగూడ చెరువు ఎఫ్‌టీఎల్‌లో కొంతమంది స్థలాన్ని ఆక్రమించి లే అవుట్ చేశారని గుర్తించారు.
కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తెచ్చిన పత్రాలను పరిశీలించి, రెవెన్యూ అధికారులు పరిశీలించాలని ఆదేశించారు. గతంలో ఫతుల్లాగూడ చెరువు రక్షణ కోసం ఫెన్సింగ్ వేశారని, అక్రమార్కులు ఫెన్సింగ్ తొలగించి స్థలాన్ని కబ్జా చేశారని స్థానికులు ఆయనకు ఫిర్యాదు చేశారు. మూడు రోజుల తర్వాత తాను స్వయంగా మళ్లీ చెరువును పరిశీలించి రెవెన్యూ అధికారులతో చర్చిస్తానని తెలిపారు. కమిషనర్ వెంట పెద్ద అంబర్‌పేట్ మున్సిపల్ కమిషనర్ రవీందర్‌రెడ్డి, ఆర్‌ఐ, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.
చెరువులను పరిరక్షించుకుందాం
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 19 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని చెరువుల ను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పిలుపునిచ్చారు. ట్రై సిటీ పరిధిలో ఆక్రమణలకు గురి కాకుండా చెరువుల పరిరక్షణకై తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ విభాగాల అధికారు లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో శుక్రవారం బుద్ధ భవన్‌లో ఆయన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ట్రై సిటీ పరిధిలో ఇష్టానుసారంగా చెరువులు ఆక్రమించి భవన నిర్మాణాలు చేశారని, ఈ కారణంగా లోతట్టు ప్రాం తాలలో వరద నీరు చేరి ముంపునకు గురవుతున్నట్టు తెలిపారు. చెరువులను కబ్జాల నుంచి కాపాడుకోవడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశం లో జీఐఎస్ డైరెక్టర్ శివకుమార్, పర్యావరణ పరిరక్షణ సంస్థల ప్రతినిధులు కల్పన రమేశ్, కౌశిక్, సుధీర్ నాథ్, రవికిరణ్, సూర్యనారాయణ, రాజు, శ్రీనివాస్ రావు, రామ్మోహన్, మనోజ్ఞ, డాక్టర్ రవి పాల్గొన్నారు.