calender_icon.png 14 February, 2025 | 3:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు

14-02-2025 12:04:21 AM

  • సుమారు 431 క్వింటాళ్ల బియ్యం పట్టివేత
  • సాయి మహదేవ్ రైస్ మిల్ సీజ్ రీసైక్లింగ్ చేసి వివిధ జిల్లాలకు తరలింపు
  • చీఫ్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్  అధికారి శశిధర్ రాజు

దౌల్తాబాద్, ఫిబ్రవరి 13: ప్రభుత్వం నిరుపేదలకు అందజేస్తున్న రేషన్ బియ్యాన్ని కొందరు అక్రమ దారులు కొనుగోలు చేసి రీసైక్లింగ్ చేసి మళ్లీ ప్రభుత్వానికి అందిస్తున్నారని, ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలంగాణ చీప్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లై కార్పొరేషన్ ఆఫీసర్  శశిధర్ రాజు అన్నారు. గురువారం సివిల్ సప్లై కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహన్ ఆదేశాల మేరకు రాయపోల్ మండలం రామారం గ్రామ శివారులో సాయి మహాదేవ్ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులతో కలిసి తనిఖీలు నిర్వహించారు.

సుమారు 863 బ్యాగుల బియ్యం  సుమారు 431 క్వింటాళ్లు రూ.15,51,600 విలువగల బియ్యం పట్టుబడినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు అందజేస్తున్న ఉచిత రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని మిల్లులో రీసైక్లింగ్ చేసి మళ్లీ ప్రభుత్వానికే అందజేస్తున్నారన్నారు. ఈ మిల్లు ప్రభుత్వానికి 1660 టన్నుల బియ్యం బాకీ ఉండడంతో దాదాపు రెండు సీజన్లు ప్రభుత్వం సాయి మహదేవ్ మిల్లుకు సీఎంఆర్ ఇవ్వలేదు.

గుట్టుగా ఇతర వాహనాల నుంచి రేషన్ బియ్యం తీసుకొచ్చి మళ్ళీ వాటిని రీసైకిలింగ్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వంను రెండు రకాలుగా మోసం చేస్తున్నారన్నారు. రీసైక్లింగ్ చేసిన బియ్యాన్ని వివిధ జిల్లాలు కామారెడ్డి, హన్మకొండ, సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూర్ మిల్లులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రేషన్ బియ్యాన్ని అమ్మిన కొన్న నాన్వెలబుల్ క్రిమినల్ కేసులు నమోదుచేసి చర్యలు తీసుకుంటామన్నారు.

మిల్లు లీజుకు తీసుకొని నడిపిస్తున్న సాయి కుమార్ రెడ్డి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. బియ్యాన్ని దౌల్తాబాద్ పౌర సరఫరాల గోదాంకు తరలించి మిల్లును సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి వెంకటేశం, సీఐ పండరి, ఎస్త్స్రలు వెంకటేశ్వర్లు, సాంబశివరాజ్, రఘుపతి, ప్రేమ్ దీప్, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ బి. ప్రవీణ్, జనరల్ మేనేజర్ రాఘవేందర్, డిసిఎస్‌ఓ తనూజ, ఏఎస్‌ఓ అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు.